Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

లింగాల కేదారి కుటుంబానికి రూ.10 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

⏩ఉద్యమకారులను గుర్తించి అండగా నిలుస్తున్న ప్రజా ప్రభుత్వం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

లింగాల కేదారి కుటుంబానికి రూ.10 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
Share Short Clip Download PDF

⏩ లింగాల కేదారి దంపతులు.. ఎంతో మందికి ఆకలి తీర్చిన గొప్ప మనసున్న దంపతులు: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హనుమకొండ (రైట్స్ మీడియా): ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన లింగాల కేదారి, పుష్పలత దంపతుల కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరు చేసిన రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కును శనివారం అందజేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కేదారి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి చెక్కును అందజేసి, కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి ఉద్యమకారులకు ఆపన్నహస్తం అందిస్తూ అండగా నిలిచిన లింగాల కేదారి సేవలను తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం గుర్తించి, ఆయన కుటుంబానికి ఆర్థిక చేయూత అందించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో పోరాడిన ఉద్యమకారులను ప్రజా ప్రభుత్వం గౌరవిస్తుందని, రానున్న రోజుల్లోనూ ఉద్యమంలో పాల్గొని పోరాటం చేసిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తుందని అన్నారు.

కేదారి కుటుంబం ప్రస్తుత కష్టకాలంలో తాను వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానని, తన వంతుగా కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటానని ఎమ్మెల్యే నాయిని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ..

అగ్ని ప్రమాదంలో దంపతులను కోల్పోయిన కుటుంబానికి జరిగిన నష్టం ఎంతో బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో ప్రభుత్వం మరియు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆకలితో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు లింగాల కేదారి దంపతులు ఎంతో మందికి ఆకలి తీర్చిన గొప్ప మనసున్న దంపతులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయాన్ని అందించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.