హైదరాబాద్, అక్టోబరు 17హైదరాబాద్(రైట్స్ మీడియా): రైతుల భూమిని కాపాడటం.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాన్ని తగ్గించడం.. ఆయిల్‌పామ్ తోటల్లో విద్యుత్తు ప్రమాదాలను నివారించడం.. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి జలాలను నిల్వ చేసుకోవడం.. ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు సాధించడం లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అక్టోబరు 16న రెండు వేర్వేరు లేఖలు అందజేశారు. సీతారామ ఎత్తిపోతల పథకం పంపిణీ కాలువలను సాంకేతికంగా సాధ్యమైన చోట పైపుల వ్యవస్థగా మార్చాలని ఒక లేఖలో కోరగా.. ఆయిల్‌పామ్ తోటల్లో విద్యుత్తు లైన్లను కవర్డ్ కండక్టర్లుగా మార్చేందుకు రాష్ట్రస్థాయి ఉమ్మడి విధానం రూపొందించాలని మరో లేఖలో ప్రతిపాదించారు. అలాగే, దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలతో నీటిని నిల్వ చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఆమోదించిన కాలువల వ్యవస్థతో పోలిస్తే పైపుల ద్వారా నీటిని పంపిణీ చేయడం వల్ల భూసేకరణ అవసరాన్ని గణనీయంగా తగ్గించవచ్చని మంత్రి వివరించారు. దీనివల్ల సుమారు 9,767 ఎకరాల భూమి ఆదా కావడంతో పాటు భూసేకరణ వ్యయంలో రూ.2,148.74 కోట్ల వరకు తగ్గింపు సాధ్యమవుతుందని అంచనా వేశారు. మరోవైపు ఆయిల్‌పామ్ తోటల్లో చెట్ల ఆకులు విద్యుత్తు తీగలకు తగలడం వల్ల ఏర్పడుతున్న సరఫరా అంతరాయాలు, ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.