హైదరాబాద్ (రైట్స్ మీడియా): గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీఆర్ఎస్ పార్టీ వారిని మోసం చేసిందని టీపీసీసీ ఎన్నారై సెల్ నాయకులు విమర్శించారు. దుబాయిలో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలకు వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ముందుగా గల్ఫ్ కార్మికులకు క్షమాపణ చెప్పిన తర్వాతే దుబాయిలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.

శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ఎన్నారై సెల్ ఛైర్మన్, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సుమారు రెండు వేల మంది గల్ఫ్ కార్మికులు మరణించారని, వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఆ కుటుంబాలను మోసం చేసిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి’ నినాదంతో గల్ఫ్ కార్మికులు కీలక పాత్ర పోషించారని ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావు అన్నారు. రాష్ట్ర సాధన కోసం కష్టపడ్డ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు.