Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

హుస్నాబాద్ నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు సహాయ పరికరాలు అందేలా చర్యలు తీసుకోవాలి

• అర్హులైన ఒక్కరూ మిగలకుండా ప్రతి గ్రామంలో లబ్ధిదారులను గుర్తించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం

హుస్నాబాద్ నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు సహాయ పరికరాలు అందేలా చర్యలు తీసుకోవాలి
Share Short Clip Download PDF

• దివ్యాంగులకు వీల్‌చైర్లు, వినికిడి పరికరాలు, ట్రైసైకిళ్లు, వాకింగ్ స్టిక్స్, కళ్లద్దాలు, కృత్రిమ అవయవాలు తదితర పరికరాలు ఉచితంగా పంపిణీ

హైదరాబాద్, అక్టోబర్ 9(రైట్స్ మీడియా):
హుస్నాబాద్ నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ (ALIMCO) సహకారంతో ADIP పథకం కింద ఉచితంగా సహాయ పరికరాలు అందించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ డా,, బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలో సహాయ పరికరాలు అవసరమైన దివ్యాంగులు, వృద్ధులు ఒక్కరు కూడా మిగిలిపోకూడదని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు వీల్‌చైర్లు, వినికిడి పరికరాలు, ట్రైసైకిళ్లు, వాకింగ్ స్టిక్స్, కళ్లద్దాలు, కృత్రిమ అవయవాలు తదితర సహాయ పరికరాలను ఉచితంగా అందించనున్నారు. 80 శాతానికి పైగా వైకల్యం ఉన్న అర్హులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లు అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

ప్రతి గ్రామంలో అర్హులను గుర్తించాలి

అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలని మూడు జిల్లాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారులను (DWO) మంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్, ఆశా కార్యకర్తల ఆధ్వర్యంలో సహాయ పరికరాలు అవసరమైన వారిని గుర్తించి, ఎవరూ మిస్ కాకుండా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో డప్పు చాటింపు ద్వారా కూడా విస్తృత ప్రచారం కల్పించి, అర్హులందరికీ ఈ పథకంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ప్రతి గ్రామంలో అర్హులను గుర్తించాలి

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

అర్హత కలిగిన వారు UDID కార్డు లేదా సదరం కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, దివ్యాంగుల పెన్షన్ కార్డు వంటి పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఈ నెల 15వ తేదీలోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 27, 28, 29 తేదీల్లో సహాయ పరికరాలను పంపిణీ చేయనున్నారు.

మూడు జిల్లాల పరిధిలో ప్రత్యేక పంపిణీ కేంద్రాలు

హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు మూడు జిల్లాల పరిధిలో ఉన్నందున, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా వేర్వేరు ప్రాంతాల్లో పంపిణీ కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి సూచించారు.

- సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల లబ్ధిదారులకు హుస్నాబాద్ పట్టణంలో.
- హనుమకొండ జిల్లా: భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల లబ్ధిదారులకు ముల్కనూరులో.
- కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి, సైదాపూర్ మండలాల లబ్ధిదారులకు అందుబాటులో ఉండే ప్రాంతంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి పరికరాలు పంపిణీ చేయనున్నారు.

సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామం నుంచి దివ్యాంగులు, వృద్ధులను ప్రత్యేక బస్సుల ద్వారా పంపిణీ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే వారికి భోజన సదుపాయాలతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారికి అవసరమైన సహాయ పరికరాలను అందించడమే లక్ష్యంగా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, మూడు జిల్లాల డీడబ్ల్యూఓలు, రాంగోపాల్ రెడ్డి (అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ డిజేబిలిటీ), రవిశంకర్ (జాయింట్ మేనేజర్, ఈడీపీ), రవికృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.