తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దాడిలో గాయపడ్డ మహిళా పోలీసులను మంత్రి సీతక్క పరామర్శించారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను మంత్రికి మహిళా పోలీసు అధికారులు వివరించారు. కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అసభ్యంగా తాకారని.. దానికి సంబంధించిన విజువల్స్ చూపించి.. సీతక్కకు మహిళా పోలీసులు ఫిర్యాదు చేశారు.
మా డ్యూటీలు మేము చేస్తుంటే టీ షర్టులు విసిరేసి మీది మీదికి వచ్చారు. విధి నిర్వహణలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం’ అని మహిళా పోలీసులు వివరించారు. తాము అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామని బెదిరించారని ఆవేదన చెందారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫొటోలు, విజువల్స్ చూసి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి డ్యూటీలు చేయాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తోందని తెలిపారు. ఈ క్రమంలో మహిళా పోలీసులకు మంత్రి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండండి మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ డ్యూటీ మీరు చేయండి. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు’ అని సీతక్క భరోసా ఇచ్చారు.