హనుమకొండ (రైట్స్ మీడియా):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రతి ఆడపడుచుకు ఎంతో ప్రత్యేకమైనదని, తెలంగాణ మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగ మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబమని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు. శుక్రవారం కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు విద్యార్థి దశ నుంచే తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా తాను అనేక సవాళ్లను అధిగమిస్తూ మహిళల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నానని నేరెళ్ల శారద తెలిపారు. నేటి సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య పెరుగుతున్న విభేదాలను పరిష్కరించేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, మహిళలు తమ హక్కులను తెలుసుకొని వాటిని సాధించుకునే దిశగా ముందుకు సాగాలని అన్నారు. బతుకమ్మ తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక మాత్రమే కాకుండా మహిళల ఐక్యతకు, ఆత్మీయతకు, సామాజిక సమైక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.
సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, దాడులు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో రాత్రి తొమ్మిది గంటల సమయంలో జరిగిన సంఘటన మహిళల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని అన్నారు. మహాత్మా గాంధీ పేర్కొన్నట్లు మహిళ అర్ధరాత్రి ఒంటరిగా స్వేచ్ఛగా తిరగగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సాధించినట్లు భావించగలమని గుర్తుచేస్తూ, నేటి పరిస్థితుల్లో రాత్రి తొమ్మిది గంటలకే మహిళలకు స్వేచ్ఛ, భద్రత కరువవడం విచారకరమని పేర్కొన్నారు. మహిళలకు సమాజంలోనే కాకుండా కుటుంబంలోనూ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, చివరకు కన్నతండ్రి దగ్గర కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతున్న ఘటనలు సమాజం ఎటువైపు వెళ్తోందో ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. ఆడపిల్లలకు భద్రత కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మహిళల పట్ల పురుషుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే సమానత్వంతో కూడిన సమాజం ఏర్పడుతుందని స్పష్టం చేశారు.
మహిళలకు విద్య, స్వేచ్ఛ, ఆత్మగౌరవం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ మహిళల హక్కుల గురించి తెలుసుకోవాలని నేరెళ్ల శారద పిలుపునిచ్చారు. మహిళల హక్కులపై విస్తృత అవగాహన కల్పించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో వంద రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల నుంచే ప్రారంభిస్తున్నామని తెలిపారు. పాఠశాలల్లో బాలికలకు స్వీయరక్షణ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని, ప్రతి శుక్రవారం, శనివారం ఈ కార్యక్రమాలను నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు పంపించనున్నట్లు తెలిపారు. బాలికలు తమను తాము రక్షించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు, మహిళలను గౌరవించే సంస్కృతిని చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో పెంపొందించాలని సూచించారు.
కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. మహిళలందరూ ఒకచోట చేరి, బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో ఆనందంగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పండుగలు ప్రజల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను పెంపొందించడంతోపాటు మన సంప్రదాయాలను కాపాడేందుకు దోహదపడతాయని తెలిపారు.
కూడా చైర్మన్ గుండు సుధారాణి మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఉత్తర తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన గొప్ప విద్యాసంస్థ అని అన్నారు. ఈ కళాశాలలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు వంటి ప్రముఖులు విద్యనభ్యసించడం గర్వకారణమని పేర్కొన్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ కళాశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. కళాశాల శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతోపాటు భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించేలా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు ఆచార్య బి. రమాదేవి మాట్లాడుతూ తెలంగాణ మహిళలు బతుకమ్మ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారని అన్నారు. ప్రకృతితో మమేకమై పూలతో బతుకమ్మను అలంకరించి, సమూహంగా ఆటపాటల్లో పాల్గొనడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు. బతుకమ్మ వేడుకలు మహిళల్లో ఐక్యతను పెంపొందించడంతోపాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని తెలిపారు.
డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కళాశాలకు ఆర్థిక సహాయం అందించేలా సంబంధిత వర్గాలు కృషి చేయాలని కోరారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ విద్యాసంస్థ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు.
నాయిని నీలిమ, మహిళా కమిషన్ సభ్యులు రాధాబాయి, రమాదేవి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ అని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళల భాగస్వామ్యంతో నిర్వహించే ఇటువంటి వేడుకలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని, తెలంగాణ సంస్కృతికి మరింత గుర్తింపును తీసుకొస్తాయని తెలిపారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుంకరి జ్యోతి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో అత్యంత ప్రధానమైనదని అన్నారు. ఈ పండుగను కళాశాలలో నిర్వహించడం ద్వారా విద్యార్థులకు తెలంగాణ వారసత్వ సంపదపై అవగాహన కల్పించడంతోపాటు మన సంస్కృతిని భావితరాలకు అందించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమివ్వాలని, వాటిని పరిరక్షించేందుకు కృషి చేయాలని సూచించారు.