హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అభిమానులతో కలిసి తన తాజా చిత్రం 'ది ప్యారడైజ్' వీక్షించేందుకు అనుమతి కోరుతూ సినీ నటుడు నాని చేసిన ట్వీట్ పై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు, కళాకారులకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
నటుడు నాని ట్వీట్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్షన్..
⏩పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నానిల డెడికేషన్ కు ప్రశంసలు
ప్రేక్షకులతో కలిసి థియేటర్లో సినిమా చూడాలన్న నాని ఆకాంక్ష అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం కోసం నాని చూపిస్తున్న అంకితభావం ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. అయితే అదే సమయంలో ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలని మంత్రి గుర్తుచేశారు.
పోలీస్ అనుమతి తప్పనిసరి: మంత్రి కోమటిరెడ్డి
నిబంధనలు పాటిస్తామంటూ నాని స్వయంగా భద్రత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పర్యటనకు సంబంధించి చిత్ర బృందం స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభిమానులకు, సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు విభాగం ట్రాఫిక్, భద్రతా అంశాలను సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేస్తూ, చిత్ర బృందానికి మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.