ఐరాస వేదికగా జరిగిన సమావేశంలో గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యతను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ నొక్కిచెప్పారు. సరఫరా గొలుసులు, ఇంధనం, ఆహార భద్రత సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించాలని సూచించారు. ఇటలీ మంత్రితో ఐమెక్ ప్రాజెక్టుపై చర్చించిన ఆయన, భారత్-సెలాక్ వాణిజ్యం 50 బిలియన్ డాలర్లకు చేరిందని పేర్కొన్నారు.
పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ముప్పు, అంతర్జాతీయ వ్యవస్థపై ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ‘గ్లోబల్ సౌత్’ దేశాల మధ్య సహకారం మరింత విస్తృతం కావాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ పిలుపునిచ్చారు. న్యూయార్క్లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ దేశాల సమావేశంలో జైశంకర్ ప్రసంగించారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న యుద్ధాలు, సరఫరా గొలుసులపై ఒత్తిడి, పెట్టుబడుల మందగమనం, దేశాలపై అప్పుల భారం వంటి సవాళ్లను అధిగమించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసికట్టుగా పోరాడాలని స్పష్టం చేశారు.