GWMC(రైట్స్ మీడియా): వరంగల్ నగర సమగ్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన చేపట్టి, తదుపరి కార్యాచరణను వేగవంతం చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీ, సీడీఎంఏ డాక్టర్ టి.కె. శ్రీదేవి అధికారులను ఆదేశించారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: ఎంఏయుడి సెక్రెటరీ, సీడీఎంఏ డాక్టర్ టి.కె. శ్రీదేవి
హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యుజిడి ప్రాజెక్టుపై సమీక్ష
క్యాంప్ కార్యాలయం నుంచి పాల్గొన్న కమిషనర్ వెంకన్న, ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ సాయపు రెడ్డి
ప్రాజెక్టు పురోగతి, నిధుల సమీకరణకు సమర్పించిన ప్రతిపాదనలపై సమగ్ర చర్చ
శనివారం హైదరాబాద్ నుంచి డాక్టర్ టి.కె. శ్రీదేవి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరంగల్ నగర యుజిడి ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. కమిషనర్ క్యాంప్ కార్యాలయం నుంచి కమిషనర్ టి. వెంకన్న, MA&UD ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ సాయపు రెడ్డి, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగరంలో చేపట్టనున్న యుజిడి ప్రాజెక్టు ప్రస్తుత పురోగతి, ఇప్పటివరకు చేపట్టిన కార్యాచరణ, టెండర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలను సీడీఎంఏ డాక్టర్ టి.కె. శ్రీదేవి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, పరిపాలనా ప్రక్రియలను సమన్వయంతో పూర్తి చేసి, టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ విస్తరణతో నగరంలో మురుగునీటి నిర్వహణ మరింత మెరుగుపడటంతో పాటు, ప్రజలకు మెరుగైన పట్టణ మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు అమలులో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
అదేవిధంగా UGD ప్రాజెక్టుకు అవసరమైన అర్బన్ చాలెంజ్ ఫండ్ నిధుల కోసం సమన్వయంతో సమర్పించిన ప్రతిపాదనలపై కూడా సమావేశంలో సమీక్షించారు. నిధుల సమీకరణకు సంబంధించి తీసుకోవాల్సిన తదుపరి చర్యలు, అవసరమైన ప్రతిపాదనలు, అనుమతుల ప్రక్రియ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
ప్రాజెక్టు అమలుకు అవసరమైన అన్ని అంశాలను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేసి, నగర ప్రజలకు ప్రయోజనం చేకూరేలా యు జి డి పనులను ముందుకు తీసుకెళ్లాలని డాక్టర్ టి.కె. శ్రీదేవి సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో బల్దియా సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఈఈలు రవికుమార్, సంజయ్ కుమార్, డీఈలు, ఏఈలు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.