వర్ధన్నపేట (రైట్స్ మీడియా): మామునూరు విమానాశ్రయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగ డిమాండ్ చేశారు.
వర్దన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో మంగళవారం జన్ను రాములు ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ చరిత్రలో మామునూరు విమానాశ్రయానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, త్వరలో ప్రారంభం కానున్న ఈ విమానాశ్రయానికి దేశంలో అణగారిన వర్గాల ఆరాధ్య దైవం, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెడితే చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకుంటున్న నేపథ్యంలో మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి, మామునూరు విమానాశ్రయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విమానాశ్రయంగా నామకరణం చేయాలని ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ, బిసి సంక్షేమ సంఘం వర్ధన్నపేట నియోజకవర్గం కార్యదర్శి మామిండ్ల చెన్నయ్య యాదవ్, అంబేద్కర్ సంఘం రాష్ట గౌరవ అధ్యక్షుడు జన్ను నర్సయ్య మాదిగ, అంబేద్కర్ సంఘం వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ జంగిలి బాస్కర్ మాదిగ, మాస్ నాయకులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.