వరంగల్ (రైట్స్ మీడియా): ఖానాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంటర్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆట-పాటల్లో రాణించడానికి, స్నేహ భావాన్ని పెంపొందించడానికి ఫ్రెషర్స్ డే కార్యక్రమాలు తోడ్పడుతాయని అన్నారు. అక్టోబర్ లో నిర్వహించే అర్ధవార్షిక పరీక్షల్లో మంచి ప్రతిభ కనబర్చాలని అన్నారు. అంతర్గత మూల్యాంకనం కు సైతం మార్కులున్నందున సిలబస్, ప్రాక్టికల్స్ పై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 430 జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సం. నుండి ఏకరూప దుస్తుల పంపిణీ అవుతున్నదని, వరంగల్ జిల్లాలో రెండవ కళాశాలగా ఇంటర్ విద్యార్థులకు ఉచిత యూనిఫాం పంపిణీ ఖానాపూర్ నుండి ప్రారంభం కావడం శుభసూచకమని అన్నారు.

యూనిఫాం వల్ల వారి మధ్య దుస్తుల రూపంలో ఉండే బేధభావాలు దూరం అవుతాయని, అందరూ ఒక్కరీతిన కనిపించడం విద్యార్థుల ఐక్యతకు దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇంటర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తూ గతంలో నోట్ బుక్స్, షూ, బ్యాగులు ఇచ్చారని, ఇపుడు యూనిఫాం ఇవ్వడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు అదనపు భారం తగ్గనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ సదానందం,సర్పంచ్ రమేష్, ఏఏపీసీ ఛైర్మెన్ మమత లైబ్రేరియన్ సుధీర్, అధ్యాపకులు , కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.