Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

మైసంపల్లికి సాగునీరు.. ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

⏩గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా 2,197 ఎకరాలకు సాగునీరు: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

మైసంపల్లికి సాగునీరు.. ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
Share Short Clip Download PDF

కోహెడ(రైట్స్ మీడియా): ‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లెపల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మైసంపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

2007 నుంచి చిరకాల స్వప్నంగా కొనసాగుతున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తయి త్వరలో నీరు అందుబాటులోకి రానుందని మంత్రి తెలిపారు. సముద్రాల, మైసంపల్లి గ్రామాలను కలుపుతూ 138 మంది రైతులకు కాలువల కోసం పరిహారం/నిధులు అందించామని చెప్పారు. ఈ రెండు గ్రామాల పరిధిలోని 2,197 ఎకరాలకు సాగునీరు అందనుందని వెల్లడించారు.

ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలి

రైతులు ఆయిల్‌పామ్ సాగు వైపు దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పంట వేసిన మూడో సంవత్సరం నుంచి ఎకరాకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. సుమారు 30 సంవత్సరాల వరకు దిగుబడి పొందే ఈ పంటకు దొంగలు, కోతుల బెడద తక్కువగా ఉంటుందని, అధికంగా నీరు అవసరం ఉండదని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతుల నుంచి డీడీలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలి

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి

గ్రామంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా ఇంటికి ఇంకుడు గుంతలు, పంట కుంటలు, గ్రామ కుంటలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, ప్రజాప్రతినిధులను మంత్రి ఆదేశించారు.

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి

అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలు

మైసంపల్లి గ్రామంలో 13 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, మరికొన్ని ఇళ్లను త్వరలో మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. కొత్తగా దాదాపు 300కు పైగా రేషన్ కార్డులు మంజూరు చేసి, వాటి ద్వారా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

298 మందికి గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 226 మంది రైతులకు రుణమాఫీ, 664 మంది లబ్ధిదారులకు రైతు భరోసా అందిస్తున్నామని తెలిపారు. వివిధ అభివృద్ధి పనుల కింద దాదాపు రూ.388.49 లక్షల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. అలాగే 483 మందికి 8.64 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలి

గ్రామంలో జరిగే ప్రతి ఫంక్షన్‌లో స్టీల్ ప్లేట్లను మాత్రమే వినియోగించేలా చూడాలని మంత్రి సూచించారు. ఫంక్షన్లలో ప్లాస్టిక్ ప్లేట్లను ఉపయోగిస్తే కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహిస్తే గ్రామ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రూ.8.5 కోట్లతో 9.5 కి.మీ. రహదారి

మైసంపల్లి గ్రామానికి వాటర్ ప్లాంట్, ఓపెన్ జిమ్ మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ఐకేపీ సెంటర్‌ నుంచి కోహెడ, సీసీ పల్లి, కాచాపూర్, మైసంపల్లి గ్రామాలను అనుసంధానం చేస్తూ 9.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.8.5 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. త్వరలో రోడ్డు పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

అలాగే కాచాపూర్ నుంచి పందిళ్ల వరకు బ్రిడ్జి, బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లతో టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

రూ.8.5 కోట్లతో 9.5 కి.మీ. రహదారి