హైదరాబాద్, అక్టోబర్ 29 (రైట్స్ మీడియా): కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈవీఎంలను రద్దు చేసి ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌తో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ సవాల్ చేశారు. ఆర్ఎస్ఎస్ కంచుకోట అయిన నాగపూర్‌లో కాంగ్రెస్ విజయం సాధించడంతో బీజేపీకి భయం పట్టుకుందని ఆయన విమర్శించారు. మంగళవారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఎన్నికల విధానం, ఈవీఎంల పనితీరుపై పలు కీలక ప్రశ్నలు సంధించారు.
ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో 28 గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగిన ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను డాక్టర్ రామకృష్ణ ప్రస్తావించారు. బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరిగితే ఫలితాలను స్వీకరిస్తామని చెబుతున్న బీజేపీ నాయకులకు ఆ విధానంపై పూర్తి నమ్మకం ఉంటే.. ధైర్యంగా రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను కూడా ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్‌తోనే నిర్వహించడానికి సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంల విషయంలో కూడా అదే పారదర్శకతపై ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనే అంశం కంటే ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండటం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమని డాక్టర్ రామకృష్ణ స్పష్టం చేశారు. ఎన్నికల విధానంపై ప్రజల్లో ఎలాంటి అనుమానాలు లేకుండా, ప్రతి ఓటరుకు తన ఓటు భద్రంగా ఉందనే విశ్వాసం కల్పించాలన్నారు.
అదేవిధంగా, భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్ కుమార్‌పై దేశవ్యాప్తంగా ఎన్నో అక్రమాల ఆరోపణలు వస్తున్నాయని, అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఆయన్ని ఎందుకు కాపాడుతున్నారని, ఆయనతో కేంద్రానికి ఉన్న లోపకారీ ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను కేవలం రాజకీయ విమర్శలకు ఉపయోగించకుండా, ఎన్నికల వ్యవస్థపై తమకు పూర్తి చిత్తశుద్ధి ఉందని నిరూపించుకునేందుకు అన్ని ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌తో నిర్వహించే అంశంపై తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డా. పెరుమాండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు.