Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో రైతులకు ప్రభుత్వం దసరా కానుక

• హుస్నాబాద్ నియోజకవర్గంలో 38 బ్రిడ్జిల నిర్మాణం.. 22 గ్రామాల్లో 24,398 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం

మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో రైతులకు ప్రభుత్వం దసరా కానుక
Share Short Clip Download PDF

• కాలువల పటిష్టత, సీసీ లైనింగ్ పనులకు అదనంగా రూ.40.779 కోట్లతో కొత్త టెండర్లకు అనుమతి

• ఏడాది లోపు పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

SRSP ఇందిరమ్మ వరద కాలువ ప్యాకేజీ-3 పనులకు రూ.211.172 కోట్లతో పరిపాలనా ఆమోదం..

హైదరాబాద్, అక్టోబర్ 19(రైట్స్ మీడియా): హుస్నాబాద్ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి సౌకర్యాలు మరింత మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక అందించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) పరిధిలోని ఇందిరమ్మ వరద కాలువ ప్యాకేజీ-3 పనులకు సంబంధించి ప్రభుత్వం జీవో నెం.518 (G.O.Rt.No.518, తేదీ: 19.10.2026) ద్వారా కీలక పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని వెల్లడించారు.

రైతులకు సాగునీరు అందించడంతో పాటు నీటిపారుదల వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.211.172 కోట్లతో వేరియేషన్ ఎస్టిమేట్-IIకు పరిపాలనా ఆమోదం లభించగా, మరోవైపు ఎడమ, కుడి ప్రధాన కాలువల్లో సీసీ లైనింగ్, అదనపు నిర్మాణాల కోసం రూ.40.779 కోట్లతో కొత్త టెండర్లు పిలిచేందుకు ప్రత్యేకంగా అనుమతి మంజూరైందని తెలిపారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలో 38 బ్రిడ్జిల నిర్మాణం

MMR కుడి ప్రధాన కాలువ పరిధిలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో మొత్తం 38 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులతో 22 గ్రామాలకు చెందిన రైతులకు, మొత్తం 24,398 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరనుంది.

• చిగురుమామిడి మండలం:
మండలంలోని ఇందుర్తి, ముదిమాణిక్యం, రామంచ, సీతారాంపూర్, రేకొండ, బొమ్మనపల్లి, పీచుపల్లి, చిన్న ముల్కనూర్ గ్రామాల్లో 19 బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఈ పరిధిలో 5,620 ఎకరాల ఆయకట్టు ఉంది.

• సైదాపూర్ మండలం:
దూదేనపల్లి, ఆకునూర్, పేర్కపల్లి, వెంకటేశ్వరపల్లి, ఘన్‌పూర్, బొమ్మకల్, అమ్మనగుర్తి, ఏక్లాస్‌పూర్, ఎలబోతారం, గొడిశాల, రాయికల్, సైదాపూర్, సోమారం, వెన్నంపల్లి గ్రామాల్లో మరో 19 బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఈ పరిధిలో 18,778 ఎకరాల ఆయకట్టు ఉంది.

రెండు మండలాల్లో కలిపి 38 బ్రిడ్జిల నిర్మాణంతో 22 గ్రామాల్లోని రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడనున్నాయని మంత్రి తెలిపారు. MMR ప్యాకేజీ కింద పెండింగ్ పనులను ఏడాదిలోపు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలో 38 బ్రిడ్జిల నిర్మాణం

కాలువల పటిష్టతకు రూ.40.779 కోట్లతో ప్రత్యేక పనులు

ఎడమ ప్రధాన కాలువ (LMC), కుడి ప్రధాన కాలువ (RMC) పరిధిలోని సున్నితమైన ప్రాంతాల్లో సీసీ లైనింగ్ పనులు, అదనపు నిర్మాణాల కోసం రూ.40.779 కోట్లతో కొత్త టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనుల ద్వారా కాలువల పటిష్టత పెరగడంతో పాటు నీటి సరఫరా మరింత సమర్థవంతంగా జరిగి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

పట్టణీకరణ విస్తరణ, గ్రానైట్ క్వారీల ఏర్పాటు వంటి క్షేత్రస్థాయి మార్పులను పరిగణనలోకి తీసుకుని ప్యాకేజీ పరిధిలోని 9,125 ఎకరాల ఆయకట్టును తొలగించడంతో పాటు, ఒప్పంద విలువను రూ.8.83 కోట్లు తగ్గించినట్లు తెలిపారు.

పనులకు సాంకేతిక మంజూరు ఇచ్చే ముందు నేల వర్గీకరణ, డిజైన్లు, డ్రాయింగ్‌ల పరిశీలనతో పాటు నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ నిర్వహించే బాధ్యతలను కరీంనగర్ ఇంజనీర్-ఇన్-చీఫ్ పర్యవేక్షిస్తారని జీవోలో పేర్కొన్నట్లు మంత్రి వివరించారు.

కాలువల పటిష్టతకు రూ.40.779 కోట్లతో ప్రత్యేక పనులు

రైతాంగ సంక్షేమానికి, సాగునీటి రంగ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఈ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడేలా నిరంతరం కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రాంతీయ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

📄 Open PDF