పర్యావరణ పరిరక్షణ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం మన బాధ్యత అని కేయూ వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో గురువారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వీసి ముఖ్య అతిథిగా హాజరై అనంతరం మాట్లాడుతూ, మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం కూడా మన బాధ్యత అని పేర్కొన్నారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. పరిరక్షణ సమష్టి బాధ్యతని, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి పనిచేసి పచ్చని క్యాంపస్‌లను అభివృద్ధి చేయాలని సూచించారు. ఒక మొక్కను నాటడం అంటే ఒక జీవాన్ని పెంచడమే. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి అని పిలుపునిచ్చారు.
సోషల్ సైన్స్ డీన్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ప్రొఫెసర్ బి. సురేష్ లాల్ మాట్లాడుతూ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన పర్యావరణహిత క్యాంపస్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎన్. రామనాథ్ కిషన్, ప్రొఫెసర్ రాజేందర్, డాక్టర్ చిర్ర రాజు, ప్రొఫెసర్ వెంకయ్య, ప్రొఫెసర్ ఈసం నారాయణ, డాక్టర్ బి.వి. గోపినాథ్, డాక్టర్ కోల శంకర్, డాక్టర్ పృథ్వీరాజ్, అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది, బి.ఎడ్., ఎం.ఎడ్. విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు.