ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో పేద ప్రజల సంక్షేమమే ప్రధాన అజెండాగా పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం నాడు లబ్ధిదారులకు నివాస స్థలాల పట్టాలు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. 173 మంది లబ్ధిదారులకు రూ. 50.86 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మల్లెపల్లి గ్రామంలో 16 మంది లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లు, మునిగేపల్లి గ్రామంలో 12 మందికి ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ ని మంత్రి చేశారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం
⏩రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
⏩కూసుమంచి క్యాంపు కార్యాలయంలో నివాస స్థలాల పట్టాలు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదవాడి భద్రత, భరోసాయే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఇప్పటివరకు సుమారు రూ. 3,250 కోట్ల రూపాయల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను రాష్ట్ర వ్యాప్తంగా పేదల వైద్య సహాయం కోసం అందించామని మంత్రి అన్నారు.
వైద్యాన్నే కాకుండా పేద పిల్లలకు ప్రైవేట్ రంగానికి దీటుగా ప్రభుత్వ రంగంలో మెరుగైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొదటి విడత కింద 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, పాలేరు నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో సగం నిర్మించి వదిలేసిన ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం రూ. 1,100 కోట్లు వెచ్చించిందని, ప్రజాధనం వృథా కాకుండా పేదలకు ఇళ్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో పేదల కోసం సేకరించి, ఆ తర్వాత ఆక్రమణలకు గురైన నివాస స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. ఆక్రమణల నుంచి విడిపించిన స్థలాలను అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పేద నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడంలో ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు చేరేలా నిరంతరం శ్రమిస్తామని మంత్రి తెలిపారు.
అంతకుముందు మంత్రి తిరుమలాయపాలెం మండలం మేడిదేపల్లి లో రూ. 220 లక్షల వ్యయంతో మెడిదేపల్లి ఆర్ అండ్ బి రోడ్ నుండి బీరోల్ ఆర్ అండ్ బి రోడ్డు వరకు నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, కూసుమంచి మండల తహసీల్దార్ సైదులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.