ఖమ్మం(రైట్స్ మీడియా): ఖమ్మం నగరంలో ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించేలా అల్లీపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.
భద్రాద్రి రాముడు కొలువైన ఖమ్మం జిల్లాలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఖమ్మం నగరంలోని అల్లీపురం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి పరిశీలించారు.