ఢిల్లీ(రైట్స్ మీడియా): అఫ్గానిస్థాన్ నుంచి భారత్ కు హెరాయిన్, మెథాంఫెటమైన్ తరలిస్తున్న నార్కో ట్రాఫికింగ్ కింగ్‌పిన్ నవ్‌ప్రీత్ సింగ్‌ను టర్కీ నుంచి భారత్ కు డిపోర్ట్ చేయించారు. ఈ చర్యను మోదీ ప్రభుత్వం సాధించిన చారిత్రక మైలురాయిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు.
డ్రగ్స్ కింగ్ పిన్ నవ్ ప్రీత్ సింగ్ అరెస్ట్... టర్కీ నుంచి భారత్ కు రప్పించిన కేంద్ర ప్రభుత్వం
డ్రగ్స్ అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది. అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు హెరాయిన్, మెథాంఫెటమైన్ తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నార్కో ట్రాఫికింగ్ కింగ్‌పిన్ నవ్ ప్రీత్ సింగ్ ను టర్కీ నుంచి భారత్‌కు రప్పించారు. నకిలీ గుర్తింపుతో నవాబ్ విర్క్ పేరుతో టర్కీ పౌరసత్వం పొందిన అతడిని భారత దర్యాప్తు సంస్థలు పక్కాగా గుర్తించి, తిరిగి భారత్ కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం అతడిని డ్రగ్స్ అక్రమ రవాణా, ఇతర నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణ నిమిత్తం జైలుకు తరలించినట్లు చెప్పారు. ఈ చర్యను మోదీ ప్రభుత్వం సాధించిన చారిత్రక మైలురాయిగా అమిత్ షా అభివర్ణించారు.
2029 డిసెంబర్ నాటికి లక్ష్యం
రాబోయే కాలంలో డ్రగ్స్ ఉక్కునడచి అణచివేయడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు వెళ్తోంది. 2029 డిసెంబర్ నాటికి దేశంలో ప్రతి నార్కో కార్టెల్‌ను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి స్పష్టం చేశారు. టర్కీ నుంచి నిందితులను భారత్ కు తీసుకురావడంలో ఇరు దేశాల మధ్య ఉన్న 2001 నాటి అప్పగింత ఒప్పందం కూడా కీలకంగా వ్యవహరించింది. గతంలోనూ పలు డ్రగ్స్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నిందితులైన మహ్మద్ సలీం డోలా, ప్రభ్‌దీప్ సింగ్‌లను టర్కీ, అజర్బైజాన్ దేశాల నుంచి భారత్ కు విజయవంతంగా తీసుకొచ్చిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రస్తావించింది.