ఖమ్మం, అక్టోబర్ -23(రైట్స్ మీడియా): జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్, చర్చి కాంపౌండ్, శ్రీనివాస్ నగర్ ప్రాంతాల్లో ఉన్న బియ్యం వ్యాపారుల దుకాణాల్లో డిప్యూటీ తహశీల్దార్లతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ తెలిపారు.

తనిఖీల్లో భాగంగా, వ్యాపారులు సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల నుండి కొనుగోలు చేసిన బియ్యానికి సంబంధించిన బిల్లులు, వే బిల్లులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం ప్రతి దుకాణం ప్రధాన ద్వారం వద్ద అందుబాటులో ఉన్న బియ్యం నిల్వల పరిమాణం, వాటి ధరల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని వ్యాపారులను ఆదేశించారు. బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించడం గానీ, మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడం గానీ చేయరాదని జిల్లా పౌరసరఫరాల అధికారి స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.