Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు సేంద్రీయ వ్యవసాయ ధ్రువీకరణ పత్రం పొందేలా రైతులను ప్రోత్సహించాలి

పంటలకు మార్కెట్ కల్పించి, ఎగుమతుల ద్వారా రైతులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలి

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు సేంద్రీయ వ్యవసాయ ధ్రువీకరణ పత్రం పొందేలా రైతులను ప్రోత్సహించాలి
Share Short Clip Download PDF

పెద్ద ఎత్తున వాణిజ్య స్థాయిలో సాగు చేపట్టేందుకు ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి | రైతులు పంటల సాగు విధానాలు, మార్కెటింగ్, ఎగుమతి ప్రక్రియలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ(రైట్స్ మీడియా): ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, మంచి మార్కెట్ ధరలు లభించేలా రైతులు సేంద్రీయ వ్యవసాయ ధ్రువీకరణ పత్రం పొందాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.

బుధవారం, జిల్లాలోని లింగాల ఘనపురం మండలంలోని సిరిపురం గ్రామంలోని రైతు బసవగాని మహేష్ వ్యవసాయ క్షేత్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMNF) కింద కృషి సఖీలు (కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ – CRPs)కు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై, పంట పొలంలో మొక్కను నాటారు.

ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయంలో ఇప్పటికే సాధించిన పురోగతి, రైతులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కోఆర్డినేటర్ నానిసా వివరిస్తూ.. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు నలుగురు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ (CRPs) ఎంపికైనట్లు పేర్కొన్నారు.

అలాగే బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన కృషి సఖీ సభ్యురాలు వనిత మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.

అదే విధంగా నర్మెట్ట మండలం, వెల్దండ గ్రామానికి చెందిన కృషి సఖీ సభ్యురాలు లక్ష్మి ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కూరగాయలు, పూల తోటలను పెంచుతున్నారు. రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ, ఉమ్మెత్త వంటి సహజ వనరుల వినియోగం గురించి వివరిస్తున్నామన్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయాన్ని కేవలం సంప్రదాయ సాగు విధానంగా కాకుండా, వాణిజ్యపరంగా విస్తరించి, రైతులకు అధిక ఆదాయం అందించే విధంగా అభివృద్ధి చేయాలన్నారు.

ఆర్గానిక్ సర్టిఫికేషన్‌తోనే వాణిజ్యపరమైన అవకాశాలు

రైతులు ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తున్నప్పటికీ, వాటిని పెద్ద ఎత్తున వాణిజ్య స్థాయికి తీసుకెళ్లాలంటే ముందుగా ఆర్గానిక్ (లేదా) నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ పొందడం ఎంతో ముఖ్యమన్నారు.

కూరగాయలు, ఇతర ప్రత్యేక పంటలను సాగు చేస్తున్న రైతులు తమ ఉత్పత్తులకు సరైన గుర్తింపు పొందితే మార్కెట్లో ప్రీమియం ధరలు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు అనుసరిస్తున్న సాగు పద్ధతులు, ఉపయోగిస్తున్న ఇన్‌పుట్స్, పంటల నిర్వహణకు సంబంధించిన అన్ని వివరాలను నమోదు చేసుకుంటూ నిర్దేశిత ప్రమాణాలను పాటించాలని సూచించారు.

ఆర్గానిక్ సర్టిఫికేషన్‌తోనే వాణిజ్యపరమైన అవకాశాలు

సర్టిఫికేషన్‌తో పాటు మార్కెట్, సరఫరా వ్యవస్థ అవసరం

పంటలకు సర్టిఫికేషన్ పొందడంతోనే ప్రక్రియ పూర్తికాదని, వాటికి తగిన మార్కెట్‌ను కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. రైతులు పండించిన ఉత్పత్తులను సేకరించడం, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నిల్వ, మార్కెటింగ్, సరఫరా వంటి అన్ని దశలను సమన్వయం చేసుకుంటూ పూర్తి స్థాయి సరఫరా వ్యవస్థ (సప్లై చైన్) ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సర్టిఫికేషన్‌తో పాటు మార్కెట్ అనుసంధానం పూర్తయినప్పుడే రైతులకు పంటలపై గరిష్ట స్థాయిలో ప్రీమియం ధరలు లభిస్తాయని పేర్కొన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలంటే సంబంధిత నాణ్యతా ప్రమాణాలు, అవసరమైన సర్టిఫికేషన్లు, HACCP వంటి ఆహార భద్రతా ధ్రువీకరణలు, ఎగుమతి అనుమతులపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు.

సర్టిఫికేషన్‌తో పాటు మార్కెట్, సరఫరా వ్యవస్థ అవసరం

సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆదర్శం

సిక్కిం రాష్ట్రం దేశంలో పూర్తిస్థాయి ఆర్గానిక్ రాష్ట్రంగా గుర్తింపు పొందడం గొప్ప విషయమని అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. డెహ్రాడూన్ ప్రాంతంలో పండించే లిచీ పండ్లు ఆర్గానిక్ సర్టిఫికేషన్, నాణ్యతా ప్రమాణాల ఆధారంగా అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయని ఉదాహరణగా వివరించారు. నాణ్యమైన ఉత్పత్తులకు సరైన ధ్రువీకరణ, మార్కెట్ అనుసంధానం ఉంటే స్థానిక రైతులు కూడా అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు పొందగలరని పేర్కొన్నారు.

సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆదర్శం

విత్తనోత్పత్తి, పంటల సాగు పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి

వరి పంటలో స్వపరాగసంపర్కం, పరపరాగసంపర్కం వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విత్తనోత్పత్తి సమయంలో పంట రకాలను బట్టి అవసరమైన దూరం, ఐసోలేషన్ పద్ధతులు పాటించడం ద్వారా నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. విత్తనోత్పత్తికి సంబంధించి మూడు మీటర్ల దూరం పాటించే విధానాన్ని వివరించారు.

రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడి మార్కెట్ సృష్టించుకోవాలి

రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా (FPOs) ఏర్పడి సమష్టిగా ఉత్పత్తులు సేకరించడం, మార్కెటింగ్ చేయడం, ఎగుమతుల దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఏ పంటను ఎలా సాగు చేయాలి, నాణ్యతను ఎలా పెంచాలి, కోత అనంతర నిర్వహణ ఎలా చేపట్టాలి, మార్కెట్‌కు అనుగుణంగా ఉత్పత్తులను ఎలా సిద్ధం చేయాలి అనే అంశాలపై పూర్తి పరిజ్ఞానం సంపాదించాలన్నారు.

వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కృషి సఖీలు ఈ కార్యక్రమాన్ని కేవలం ఉద్యోగ బాధ్యతగా భావించకుండా, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మార్పుకు మార్గదర్శకులుగా వ్యవహరించాలన్నారు. రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ఆర్గానిక్ సర్టిఫికేషన్, మార్కెటింగ్, ఎగుమతులపై అవగాహన కల్పించాలని సూచించారు.

గుజరాత్‌లో అమూల్ సంస్థ విజయవంతమైన సహకార వ్యవస్థను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, రైతులు కూడా సంఘటితంగా పనిచేస్తే వ్యవసాయ ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ సృష్టించుకోవచ్చని తెలిపారు. పుట్టగొడుగుల (మష్రూమ్) సాగు ద్వారా కూడా అదనపు ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయ వనరులు కల్పించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.

గ్రామీణ వ్యవసాయాభివృద్ధికి మార్గదర్శకులుగా కృషి సఖీలు ఎదగాలని, రైతులకు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందిస్తూ ప్రకృతి వ్యవసాయ విస్తరణలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

అనంతరం ప్రకృతి వ్యవసాయ సంబంధిత పోస్టర్లను వారు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, ఏడీఏ వసంత సుగుణ, డీపీఎంలు జ్యోతి, నళిని, ఉద్యానవన శాఖ అధికారులు, ఇతర వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులు, కన్సల్టెంట్లు, కృషి సఖీలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.