జిడబ్ల్యూఎంసీ, నవంబర్ 4(రైట్స్ మీడియా): ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెసర్లు శంకర్, శశి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో డ్రోన్ సర్వే నిర్వహణ, త్రీడీ మ్యాపింగ్ రూపకల్పన, సాంకేతిక విధానాలు, అమలు సాధ్యాసాధ్యాలను వివరించారు. ఈ సాంకేతికత ద్వారా నగర మౌలిక సదుపాయాల సమగ్ర డిజిటల్ సమాచారాన్ని సేకరించి, భవిష్యత్తు పట్టణాభివృద్ధి ప్రణాళికలను మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ప్రజెంటేషన్‌ను సమీక్షించిన హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ ఐఏఎస్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న డ్రోన్ సర్వే, త్రీడీ మ్యాపింగ్ అమలుకు సమగ్ర కార్యాచరణ రూపొందించి, ఎన్‌ఐటీ నిపుణులు, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

ఈ సమావేశంలో జీడబ్ల్యూఎంసీ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఐటీ మేనేజర్ రమేష్, టౌన్ ప్లానింగ్ అధికారులు అవినాష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.