డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం బీచ్ లో గురువారం స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, ప్లాస్టిక్ సామగ్రిని తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు.
ఎస్.యానం గ్రామానికి చెందిన మహిళలు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని బీచ్లోని వ్యర్థాలు, ప్లాస్టిక్ సామగ్రిని తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.