తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సున్నా ఎకరాల నుంచి వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎలా ఎదిగారని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం ఎన్నికల అఫిడవిట్లతో అడ్డంగా దొరికిపోయిందని ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. 2004 కరీంనగర్ లోక్సభ ఎన్నికల అఫిడవిట్లో తనకు ఒక్క ఎకరం భూమి కూడా లేదని స్వయంగా పేర్కొన్న కేసీఆర్ కు, ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మొదలుకొని, పదేళ్ల అధికార కాలంలో కేసీఆర్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ద్వారానే ఆయన ఆస్తులు, భూములు ఎంత భారీగా పెరిగాయో స్పష్టమవుతోందని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు అప్పులు మిగిలితే.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని పొంగులేటి నిలదీశారు. ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం వల్లే ఈ అక్రమ సంపాదన వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్ కు పుట్టుకతోనే వందల ఎకరాల భూములు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 2004 ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు రాసి ఎన్నికల సంఘాన్ని మోసం చేశారా?, లేక నేడు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారా? అని కేటీఆర్ ను ప్రశ్నించారు. ఉద్యమకారుల త్యాగాల పునాదులపై కల్వకుంట్ల ముఠా లక్షల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టుకుందని విమర్శించారు.