Thursday, 05 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలి

అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
Share Short Clip Download PDF

• విద్యుత్ స్తంభాలు, పాత గోడలు, భారీ వృక్షాలకు దూరంగా ఉండాలి

ఖమ్మం(రైట్స్ మీడియా):
అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

స్థానిక వాతావరణ పరిస్థితులను ఎప్పటి కప్పుడు పరిశీలించాలని, భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు, సంబంధిత శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులు (సీడీపీఓలు) అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు.

తుఫాను నేపథ్యంలో జిల్లా అధికారులు, ఇతర సిబ్బందికి మంజూరు చేసిన సెలవులను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ విధులకు హాజరై, తమ హెడ్‌క్వార్టర్లలోనే అందుబాటులో ఉండాలని, అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదని ఆదేశించారు.

తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా తక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

విద్యుత్ అంతరాయాలపై తక్షణ చర్యలు తీసుకోవాలి:

భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ, అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించి, సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రజలు విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో భారీ వృక్షాలు, చెట్లుకూలిపోయే ప్రమాదం ఉందని, ప్రజలు చెట్ల కింద నిలబడరాదని కలెక్టర్ సూచించారు.

పాతబడిన గోడలు, శిథిలావస్థలో ఉన్న భవనాల సమీపంలో ఉండకూడదని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సూచించిన జాగ్రత్తలను పాటించాలని తెలిపారు.

తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.