తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కొందరు రఘు మాస్టర్ ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం చెల్లదు అని, తాము ఆ కార్యవర్గాన్ని గుర్తించడం లేదని సుమలత అన్నారు. తమకు ఎలాంటి అధికారిక న్యాయపరమైన నోటీసు ఇవ్వకుండా మరో వర్గం కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం చట్టబద్ధం కాదన్నారు.
రఘు మాస్టర్ వర్గం ప్రకటించిన కొత్త కార్యవర్గంపై సుమలత దేవి తీవ్రస్థాయిలో స్పందించారు. తమను, తమ సభ్యులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
“కొంతమంది పెద్దలే మా యూనియన్‌ను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఒక వర్గం ఏర్పాటు చేసుకున్న కార్యవర్గం అధికారికం కాదు. దానికి మా అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేదు. అందులో గతంలో తప్పులు చేసినవారే ఉన్నారు. మా కార్యవర్గానికి ఎలాంటి లీగల్ నోటీసు రాలేదు. నోటీసు ఇవ్వకుండా మా కార్యవర్గాన్ని నాన్-ఆఫీషియల్ అని ఎలా ప్రకటిస్తారు?” అని సుమలత ప్రశ్నించారు.
అసోసియేషన్‌లో గతంలో జరిగినట్లు చెబుతున్న రూ.36 లక్షల అవినీతి వ్యవహారానికి సంబంధించిన తుది నివేదికను ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించినందుకే ప్రస్తుతం ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.
“మా యూనియన్ సమస్యపై నిర్ణయం తీసుకునే అధికారం మా సభ్యులకే ఉంది. మేము నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తున్నాం. యూనియన్‌లో సభ్యులు ఓటు వేయకుండా అడ్డుకునే పరిస్థితులను కొందరు సృష్టిస్తున్నారు. మాకు ఫెడరేషన్ మద్దతు కావాలి. మా కార్యవర్గం ఏ తప్పు చేసిందో స్పష్టంగా చెప్పాలి. మేము ఫెడరేషన్‌తోనే ఉంటాం. ఫిల్మ్ ఛాంబర్ కూడా మాకు మద్దతుగా ఉడాలి ” అని ఆమె పేర్కొన్నారు.
తమ సమస్యను ఫిల్మ్ ఛాంబర్, మెగాస్టార్ చిరంజీవి, సురేష్ బాబు, దిల్ రాజు, అశోక్, రాందాస్ వంటి సినీ పెద్దలు పరిష్కరించాలని సుమలత విజ్ఞప్తి చేశారు. తమ యూనియన్ కు మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
“మెగస్టార్ చిరంజీవి అంటే మాకు ఎంతో ఇష్టం. డ్యాన్స్ అంటే ముందుగా మాకు ఆయనే గుర్తొస్తారు. ఆయన మా సమస్యను పరిష్కరించాలి. తప్పులు చేసిన మా సభ్యుల్లో కొందరిని నిలదీసి ప్రశ్నించినందుకే ఈ స్థాయిలో వివాదం చేస్తున్నారు” అని అన్నారు.
అయితే, యూనియన్‌ను చీల్చేందుకు లేదా సభ్యులను ఇబ్బంది పెట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే సహించేది లేదంటూ సుమలత తీవ్ర హెచ్చరిక చేశారు.
“మా యూనియన్‌ను విడదీయాలని చూసేవారికి ఇదే మా హెచ్చరిక. యూనియన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని సభ్యులను, యూనియన్ కార్యకలాపాలను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఎవరైనా హద్దులు దాటితే వారికి గట్టిగా బుద్ధి చెబుతాం. మా యూనియన్ ఐక్యతను దెబ్బతీసే చర్యలను ఎంతమాత్రం సహించేది లేదు” అని సుమలత హెచ్చరించారు.