సూపర్ ఎల్ నినో, వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన, ఆయిల్ పామ్, కూరగాయలు, మల్బరీ, పూలు, మునగ, ఉల్లి మొదలైన మార్కెట్ డిమాండ్ పంటలు సాగు చేస్తున్న రైతులకు నీటి సంరక్షణ పద్ధతులు చాలా ముఖ్యమని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. వీటిలో ముఖ్యంగా నీటి కుంటలు, కూరగాయ పందిళ్లు, ట్రెల్లిస్ పద్ధతి, మల్చింగ్, ఎత్తు మడులు, బిందు సేద్యం, ఫర్టిగేషన్, సేంద్రీయ పద్ధతులు, నేచురల్ ఫార్మింగ్ వంటివి పాటించాలని సూచించారు.
ఉద్యాన పంటలకు నీటి కుంటలు చాలా ముఖ్యం: జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న
నీటి కుంటల ఉద్దేశం:
వర్షపు నీటిని నిల్వ చేసి ఎండాకాలం లేదా కరవు సమయాల్లో నీటి ఎద్దడి రాకుండా చూడటమే నీటి కుంటల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కూరగాయలు, ఆయిల్ పామ్, పండ్ల తోటలు, మల్బరీ, పూలు, మునగ తదితర పంటలలో పూత, పిందె దశల్లో (క్రిటికల్ స్టేజెస్) నీటిపారుదలందించి పంటలను కాపాడుకోవచ్చని వివరించారు.
వికసిత్ భారత్ గ్యారెంటీ రోజ్ గార్ అజివికా మిషన్ గ్రామీణ్ పథకం:
5 ఎకరాల లోపు విస్తీర్ణం కలిగిన సన్న, చిన్నకారు రైతులు ఈ పథకం ద్వారా రెండు సైజుల్లో పంట కుంటలు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. దీనికి పట్టదార్ పాస్ బుక్, జాబ్ కార్డ్ పత్రాలు అవసరమవుతాయి.
*మోడల్ 01: 40 అడుగుల పొడవు X 40 అడుగుల వెడల్పు X 6.5 అడుగుల లోతు (12 మీటర్లు X 12 మీటర్లు X 2 మీటర్లు). అంచనా వ్యయం రూ.80 వేలు, పని దినాల సంఖ్య 400.
*మోడల్ 02: 65 అడుగుల పొడవు X 65 అడుగుల వెడల్పు X 10 అడుగుల లోతు (20 మీటర్లు X 20 మీటర్లు X 3 మీటర్లు). అంచనా వ్యయం రూ.4 లక్షలు, పని దినాల సంఖ్య 1100.
ఆయిల్ పామ్ పథకం (నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్):
ఆయిల్ పామ్ రైతులకు 65 అడుగుల పొడవు X 65 అడుగుల వెడల్పు X 10 అడుగుల లోతు (20 మీటర్లు X 20 మీటర్లు X 3 మీటర్లు) కొలతలతో జియో మెంబ్రేన్ షీట్‌తో కూడిన నీటి కుంటను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని అంచనా వ్యయం రూ.4 లక్షలు కాగా, రూ.90 వేల రాయితీ వర్తిస్తుందని తెలిపారు. రైతులు శాశ్వత ఆదాయం కోసం నీటి కుంటలు (పంట కుంటలు) ఏర్పాటు చేసుకోవాలని జిల్లా అధికారి విజ్ఞప్తి చేశారు.