ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన ధ్రువపత్రాలతో విచారణకు హాజరై తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని తహసీల్దార్ ముప్పు కృష్ణ కోరారు. కొండాపూర్ గ్రామంలో 2002 సంవత్సరపు ఓటరు జాబితాను 2025 సంవత్సరపు ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియలో భాగంగా 147 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ నోటీసులకు సంబంధించి మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత డాక్యుమెంట్లతో విచారణకు హాజరయ్యారని తెలిపారు. విచారణకు హాజరైన ఓటర్ల వివరాలను పరిశీలించి, సంబంధిత ఓటరుతో ఫొటో తీసి బూత్ లెవెల్ అధికారి ద్వారా బీఎల్‌ఓ లాగిన్‌లో నమోదు చేసినట్లు వివరించారు.మండల పరిధిలోని ఓటర్లందరూ తమకు ఎస్‌ఐఆర్‌కు సంబంధించి నోటీసులు అందితే వాటిని నిర్లక్ష్యం చేయకుండా బూత్ లెవెల్ అధికారి సూచనల మేరకు అవసరమైన ధ్రువపత్రాలను జతపరచి విచారణకు హాజరు కావాలని తహసీల్దార్ ముప్పు కృష్ణ విజ్ఞప్తి చేశారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ పేరు ఓటరు జాబితాలో కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రజలందరూ సహకరించాలని, నోటీసులు అందుకున్న వారు సకాలంలో స్పందించి విచారణలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల గిర్దావర్ సంపత్, గ్రామ పాలన అధికారి గోవర్ధన్, బూత్ లెవెల్ అధికారి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.