శాసనసభలో కాకుండా రోడ్లపై పోలీసులపై దాడికి ప్రయత్నించిన బీఆర్‌ఎస్ నాయకులను అడ్డుకున్నందుకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమైన చర్య అని చెల్పూర్ సర్పంచ్ వంతడుపుల కస్తూరి అన్నారు. దమ్ముంటే శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చల్లో పాల్గొనాలి కానీ, ఇలా చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రజల్లో అభాసుపాలు కావడం సరికాదన్నారు. తాతా మధు చేసిన వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ పార్టీకి దళితుల పట్ల ఉన్న వైఖరి ఏమిటో ప్రజలకు మరోసారి స్పష్టమైందని అన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్ నాయకుల దొర పోకడలను అసహ్యించుకునే 2023లో ఆ పార్టీని దారుణంగా ఓడించినా, ఇప్పటికీ వారి అహంకారం తగ్గలేదని విమర్శించారు.
రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ముందుకు వచ్చి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కు క్షమాపణ చెప్పాలని, అలాగే ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలని మండలి చైర్మన్ కి సిఫారసు చేయాలని వంతడుపుల కస్తూరి డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన శాసనసభలో కావాలని అల్లర్లు సృష్టిస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు ఇకనైనా కుటిల రాజకీయాలను మానుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.