హైదరాబాద్(రైట్స్ మీడియా): బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్.రాంచందర్ రావు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ప్రత్యేక పూజలు నిర్వహించి వారోత్సవాలను ప్రారంభించారు.
పరివర్తనతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనడానికి వాల్మీకి జీవితమే నిదర్శనం
తొలినాళ్ల జీవితంలో దోపిడీదారుడిగా ముద్రపడిన వ్యక్తి, అంతర్మథనంతో గొప్ప పరివర్తన చెంది పవిత్ర రామాయణ మహాకావ్యాన్ని రచించి, లవకుశులకు గురువై ఆదికవిగా వాల్మీకి చిరస్మరణీయుడయ్యారు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
తొలినాళ్ల జీవితంలో దోపిడీదారుడిగా ముద్రపడిన వ్యక్తి, అంతర్మథనంతో గొప్ప పరివర్తన చెంది పవిత్ర రామాయణ మహాకావ్యాన్ని రచించి, లవకుశులకు గురువై ఆదికవిగా వాల్మీకి చిరస్మరణీయుడయ్యారు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ...
పరివర్తనతో ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చనడానికి మహర్షి వాల్మీకి జీవితమే నిదర్శనమని కొనియాడారు. తొలినాళ్ల జీవితంలో దోపిడీదారుడిగా ముద్రపడిన వ్యక్తి, అంతర్మథనంతో గొప్ప పరివర్తన చెంది పవిత్ర రామాయణ మహాకావ్యాన్ని రచించి, లవకుశులకు గురువై ఆదికవిగా చిరస్మరణీయుడయ్యారని గుర్తుచేశారు. సమాజంలో ఏ స్థాయిలో ఉన్నా దృఢ సంకల్పం, మార్పు, కఠోర కృషితో అట్టడుగు వర్గాల వారు సైతం మహర్షులుగా ఎదగవచ్చనే స్ఫూర్తిని వాల్మీకి జీవన చరిత్ర చాటిచెబుతోందన్నారు. ఆయన రచించిన రామాయణం నేడు ప్రతి ఇంటిలో భాగమై, జాతి గుండెల్లో నిలిచిందని పేర్కొన్నారు. శ్రీరాముడు దేశమంతటికీ ఆరాధ్యుడని, కేవలం ఉత్తర భారతదేశానికే పరిమితమని, దక్షిణ భారతదేశంలో లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆయన అవివేకానికి నిదర్శనమని చురకలు అంటించారు. వాల్మీకి మహర్షి సేవలను స్మరిస్తూ అయోధ్యలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పేరే పెట్టారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వాల్మీకి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ మాట్లాడుతూ...
కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు రాబోయే వారం రోజుల పాటు ప్రతి ఎస్సీ బస్తీలోనూ వాల్మీకి జయంతి వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వాల్మీకి మహర్షి బోధనలు, హైందవ సంస్కృతి విశిష్టత, ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుని సద్గుణాలను సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వాల్మీకి మహర్షికి దీపాంజలి సమర్పించి ప్రారంభమవడంతో ఈ వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతికిరణ్, కొప్పు భాషా, వాల్మీకి సమాజం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ సింగ్, ఇతర ముఖ్య నాయకులు, ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.