Thursday, 05 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
క్రైమ్ న్యూస్

ఏటీఎం చోరీ కేసును ఛేదించిన కామారెడ్డి పోలీసులు...

రూ.25.45 లక్షల నగదు అపహరణ.. రాజస్థాన్‌లో నిందితుడి అరెస్ట్‌

ఏటీఎం చోరీ కేసును ఛేదించిన కామారెడ్డి పోలీసులు...
Share Short Clip Download PDF

రూ.25.45 లక్షల నగదు అపహరణ.. రాజస్థాన్‌లో నిందితుడి అరెస్ట్‌

కామారెడ్డి (రైట్స్ మీడియా): కామారెడ్డి జిల్లా గాంధారిలో సంచలనం సృష్టించిన ఎస్‌బీఐ ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి రూ.25,45,900 నగదును అపహరించిన అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన రషీద్‌ (30) అనే నిందితుడిని రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. చోరీకి ఉపయోగించిన నల్లరంగు మహీంద్రా స్కార్పియో వాహనంతో పాటు నగదు, మొబైల్ ఫోన్లు, గ్యాస్ కట్టింగ్ పరికరాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

గాంధారి గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో అక్టోబర్‌ 10, 11 తేదీల మధ్య రాత్రి ఈ చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి, నగదుతో ఉన్న ఐదు బాక్సులను అపహరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏటీఎం చోరీ కేసును ఛేదించిన కామారెడ్డి పోలీసులు...

సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారంతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నల్లరంగు స్కార్పియో వాహనానికి వేర్వేరు నంబర్ ప్లేట్లు అమర్చి పోలీసుల నుంచి తప్పించుకుంటున్నట్లు గుర్తించారు. కరీంనగర్ ప్రాంతంలోనూ రెండు ఎస్‌బీఐ ఏటీఎంల వద్ద చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

గాంధారి ఘటన అనంతరం రాజస్థాన్‌కు పారిపోయిన నిందితుల కోసం అక్కడి పోలీసుల సహకారంతో గాలింపు చేపట్టగా, బరోడామేవ్ సమీపంలో రషీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.29,400 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, స్కార్పియో వాహనం, గ్యాస్ కట్టింగ్ పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్ పరికరాలు, వివిధ నంబర్ ప్లేట్లు, కత్తులు, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో పరారీలో ఉన్న ఇతర నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Source / reference: Senior Journalist Nakka Rakesh, Erstwhile Nizamabad.