భారత సాంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక వైద్యం, సరికొత్త సాంకేతికతలతో అనుసంధానించాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సీఎస్ఐఆర్-టీకేడీఎల్ సందర్శన సందర్భంగా పిలుపునిచ్చారు. యువ పరిశోధకులు, విద్యాసంస్థలతో భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని, నిరూపిత ఆధారాలతో కూడిన పరిశోధనలను విస్తరించాలని సూచించారు.
ఆధునిక సైన్స్, వైద్య రంగాలతో సాంప్రదాయ విజ్ఞానాన్ని అనుసంధానించాలి: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
భారతదేశ సాంప్రదాయ విజ్ఞానం కేవలం ప్రాచీన వైద్య విధానాలకే పరిమితం కాకుండా, ఆధునిక సైన్స్, వైద్య రంగం, సరికొత్త సాంకేతికతలతో మరింత లోతుగా అనుసంధానం కావాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్-సాంప్రదాయ విజ్ఞాన డిజిటల్ లైబ్రరీని జితేంద్ర సింగ్ సందర్శించి, సంస్థ విస్తరణ, పరిశోధనలపై సమీక్ష నిర్వహించారు.
సాంప్రదాయ విజ్ఞానాన్ని కేవలం ఆయుర్వేదం కోణంలోనే చూడకుండా విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థులకు కో-గైడెన్స్‌తో పాటు అకడమిక్, మెడికల్ సంస్థలతో సీఎస్ఐఆర్-టీకేడీఎల్ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు. 2001లో ప్రారంభమైన టీకేడీఎల్.. సాంప్రదాయ ఔషధాల సమాచారాన్ని ఆధునిక పేటెంట్ పరిభాషలోకి అనువదించి, విదేశాల్లో మన విజ్ఞానానికి తప్పుడు పేటెంట్లు రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రస్తుతం కేవలం ఔషధాలకే కాకుండా రోగనిర్ధారణ పద్ధతులు, పరికరాలు, శస్త్రచికిత్సా విధానాల వైపు కూడా ఈ డేటాబేస్ విస్తరిస్తోందని పేర్కొన్నారు.