Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
ప్రాతినిధ్యం

వర్ధన్నపేట జూనియర్ కళాశాలలో బోర్డు ఉంది.. అధికారుల పేర్లు ఏవి?

సమాచార హక్కు చట్టానికి తూట్లు.. నామమాత్రంగా 'RTI' బోర్డు

వర్ధన్నపేట జూనియర్ కళాశాలలో బోర్డు ఉంది.. అధికారుల పేర్లు ఏవి?
Share Short Clip Download PDF

ప్రాతినిధ్యం— బుర్ర వెంకటరమణ, వర్థన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి (రైట్స్ మీడియా):

ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకతను పెంపొందించడానికి, పౌరులకు సమాచార హక్కును కల్పించడానికి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం (RTI) బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రం ఈ చట్టం నామమాత్రంగానే అమలుకు నోచుకుంటోంది.

బోర్డు ఉందయ్యా.. పేర్లు లేవయ్యా!

కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట గోడపై సమాచార హక్కు బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ, అందులో ఉండాల్సిన ప్రధాన వివరాలు గాలికి వదిలేశారు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO), అసిస్టెంట్ PIO (APIO), అప్పిలేట్ అథారిటీ అధికారుల పేర్లు, వారి హోదాలు, ఫోన్ నంబర్లు నమోదు చేయకుండా కేవలం ఖాళీ గడులతో బోర్డును వదిలేశారు. దీంతో కళాశాలకు సంబంధించిన ఏవైనా వివరాలు తెలుసుకోవాలన్నా, దరఖాస్తు చేయాలన్నా ఎవరిని సంప్రదించాలో తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.

చట్టం ఏం చెబుతోంది..?

సమాచార హక్కు చట్టం-2005, సెక్షన్ 4(1)(b) ప్రకారం ప్రతి ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆధారిత సంస్థల ప్రాంగణంలో:
• పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO) పేరు & హోదా
• అసిస్టెంట్ PIO (APIO) పేరు & సంప్రదించాల్సిన ఫోన్ నంబర్
• అప్పిలేట్ అథారిటీ వివరాలు
స్పష్టంగా ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలి. కానీ వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ చట్టపరమైన నిబంధనలను బహిరంగంగానే ఉల్లంఘిస్తున్నారు. బోర్డులు పెట్టి పేర్లు రాయకుండా వదిలేయడం వెనుక అంతర్యం ఏమిటని స్థానికులు, హక్కుల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

అక్రమాలను దాచేందుకేనా? — విద్యార్థి, ప్రజా సంఘాల మండిపాటు

కళాశాలలో నిధుల వినియోగం, అడ్మిషన్లు, మధ్యాహ్న భోజన పథకం అమలు మరియు వివిధ రకాల ఫీజుల వసూళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని, వాటికి సంబంధించిన సమాచారం బయటకు రాకుండా తొక్కేసేందుకే అధికారులు కావాలనే RTI బోర్డును పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచలేదని విద్యార్థి, ప్రజా సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు.

డిమాండ్:

ఇప్పటికైనా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (DIEO) తక్షణమే స్పందించి, వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమగ్రమైన వివరాలతో కూడిన RTI బోర్డును వెంటనే ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు. అలాగే చట్ట నిబంధనలను నిర్లక్ష్యం చేస్తూ వ్యవహరిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.