కాకతీయ విశ్వవిద్యాలయ కమిటీ హాల్‌లో మంగళవారం ఉదయం అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, నాన్-గెజిటెడ్, నాల్గవ తరగతి మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన “ముందస్తు రక్షాబంధనం” కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు వైస్ ఛాన్సలర్‌కు రాఖీలు కట్టగా, ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు.
భారతీయ సంస్కృతి లో సోదర - సోదరి అనుబంధం గొప్పది: వీసి ఆచార్యులు ప్రతాప్ రెడ్డి
భారతీయ సంస్కృతిలో సోదర–సోదరి అనుబంధానికి విశిష్టమైన స్థానం ఉందని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ..
విశ్వవిద్యాలయ అభివృద్ధిలో మహిళా ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. రాబోయే రోజుల్లో విశ్వవిద్యాలయంలో విద్యార్థినుల సంఖ్య మరింత గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు రావాల్సిన అన్ని ప్రయోజనాలను రాబోయే మూడు నెలల్లో పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం మాట్లాడుతూ, మహిళా ఉద్యోగులు తమ విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తున్నారని అభినందించారు. విశ్వవిద్యాలయంలో ఆరోగ్యకరమైన, సమర్థవంతమైన వర్క్ కల్చర్‌ను పెంపొందించడంలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ మహమ్మద్ హబీబుద్దీన్, డిప్యూటీ రిజిస్ట్రార్లు పంజాల శ్రీధర్, లింగంపల్లి రాము, సహాయ రిజిస్ట్రార్లు డాక్టర్ కే. శంకర్, డాక్టర్ పృథ్వీ రాజు వల్లాల, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు అధికారులకు రాఖీలు కట్టి, మిఠాయిలు పంచుకున్నారు.