నరసరావుపేట, అక్టోబర్ 16(రైట్స్ మీడియా): ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) వేదికగా నిలుస్తుందని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. స్థానిక నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని నియోజకవర్గ ప్రజల నుంచి నేరుగా అర్జీలు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేసిన ప్రజలతో ఎమ్మెల్యే స్వయంగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం తక్షణ పరిష్కారం నిమిత్తం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అధికారులు ప్రజా సమస్యల పట్ల వేగంగా స్పందించాలని సూచించారు. ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల శాశ్వత పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.