Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

• ప్రజాపాలనలో భాగంగా ప్రతి డివిజన్‌లో సమగ్ర అభివృద్ధి పనులు..

వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
Share Short Clip Download PDF

•ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు అభివృద్ధి నిధులు కేటాయింపు – పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం…

త్వరలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం కానున్నాయి – ప్రజలు సహకరించాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ (రైట్స్ మీడియా): ప్రజా పాలనలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

11వ డివిజన్ పరిధిలోని పోతననగర్‌లో సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రహదారులు, సైడ్ డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు కుడా చైర్మన్ గుండు సుధారాణి తో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

పోతననగర్ ప్రాంతంలో గత నాలుగు దశాబ్దాలుగా రహదారుల సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. గతంలో డాంబర్ రోడ్లు నిర్మించినప్పటికీ ప్రతి వర్షాకాలంలో రోడ్లు దెబ్బతినడం, తిరిగి మరమ్మతులు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ముఖ్యంగా భారీ వాహనాలు నిరంతరం రాకపోకలు సాగించే ఈ రహదారిపై తరచూ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు.

నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, మురుగునీరు రోడ్లపైకి రాకుండా సైడ్ డ్రైనేజీలకు గ్రిల్స్ ఏర్పాటు చేయడం వంటి పనులు చేపడుతున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీల నిర్మాణం సమన్వయంతో జరిగితేనే ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

నియోజకవర్గంలోని 26 డివిజన్లలో పార్టీకి రాజకీయ భేదాభిప్రాయాలు లేకుండా అన్ని డివిజన్లకు సమాన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఒక్కో డివిజన్‌కు సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు అభివృద్ధి నిధులు కేటాయించి రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వరంగల్ నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని త్వరలోనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పనులు పూర్తయితే నగరంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టే సమయంలో రోడ్లను తవ్వాల్సి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తుగా సహకరించాలని కోరారు. తాత్కాలిక ఇబ్బందులను ఓర్చుకొని భవిష్యత్ తరాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ విమర్శలు చేయడం కంటే ప్రజలకు ఉపయోగపడే పనుల్లో అన్ని పార్టీలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సూచించారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయడం సహజమని, కానీ నిరంతరం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు.

గతంలో కుడా భూముల విషయంలో రూ.50 కోట్లు, రూ.70 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సంబంధిత భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కొనుగోలుదారులు ముందుకు రాని నేపథ్యంలో ఐటీ టవర్స్ ఏర్పాటుకు వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కుడా చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు అందరూ సమన్వయంతో టీమ్‌వర్క్‌గా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ రంగం విస్తరణ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని ముందుకు సాగుతున్నామని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఆరు గ్యారంటీల అమలుతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించడం, గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇల్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం, రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం, చేయూత పథకం ద్వారా అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య చికిత్సా భరోసా అందిస్తున్నట్లు వివరించారు.

ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే తమ బాధ్యత అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రతిరోజూ రెండు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూ పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడతామని, ప్రతి డివిజన్‌ను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మ, డివిజన్ ఇంచార్జ్ బోడ డిన్న, మాజీ కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, డివిజన్ అధ్యక్షులు సమద్, మాజీ అధ్యక్షులు సంగీత్, గోల్కొండ సాంబయ్య, బొమ్మ సురేష్, పూర్ణ, క్రాంతి, రోషన్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి