హైదరాబాద్(రైట్స్ మీడియా): రాష్ట్ర రాజధాని హైదరాబాద్, దేశ రాజధాని ఢిల్లీని కలుపుతూ నడుస్తున్న తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారంతో అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంది. 1976 అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ చారిత్రక రైలు ప్రయాణం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రయాణికులు, రైల్వే వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్ లోని సికింద్రాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు రాకపోకలు సాగిస్తున్న ప్రతిష్టాత్మక తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారంతో అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంది. వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఆరు అక్టోబర్ మూడవ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళ్రావు, అప్పటి రైల్వే మంత్రి మధు దండవతె సికింద్రాబాద్‌లో ఈ ఎక్స్‌ప్రెస్ రైలును లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభంలో పద్నాలుగు బోగీలతో వారానికి రెండ్రోజులు నడిపిన ఈ రైలును, ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగడంతో మూడ్రోజుల చొప్పున పొడిగించారు. ఆ తర్వాత ప్రయాణికుల సౌకర్యార్థం వెయ్యి తొమ్మిది వందల తొంబై ఒకటి నుంచి ప్రతిరోజూ నడుపుతూ బోగీలను ఇరవై నాలుగుకు పెంచారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రెండు వేల పదిహేను నవంబర్ పదిహేనవ తేదీన ఈ రైలు పేరును 'తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 'గా అధికారికంగా మార్చారు.
పెద్దపల్లిలో స్టాప్ కల్పించాలని విజ్ఞప్తి
దేశంలోని రెండు ప్రధాన నగరాలను అనుసంధానించడంలో ఈ రైలు కీలక పాత్ర పోషిస్తోందని ప్రయాణికులు కొనియాడుతున్నారు. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం పెద్దపల్లి జంక్షన్లో ఈ రైలుకు స్టాప్ సదుపాయం కల్పిస్తే ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యంగా ఉంటుందని ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం సభ్యుడు ఫణి కుమార్ కోరుతున్నారు. అర్ధ శతాబ్దం పాటు నిర్విరామంగా సేవలు అందిస్తున్న ఈ రైలు ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని రైల్వే నిపుణులు గుర్తుచేస్తున్నారు.