హనుమకొండ (రైట్స్ మీడియా): వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు పై ఒక టీవీ ఛానల్‌లో ఎలాంటి ఆధారాలు లేకుండా, వాస్తవాలను నిర్ధారించుకోకుండా తప్పుడు వార్తలను ప్రసారం చేయడాన్ని GWMC 2వ డివిజన్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా సెక్రటరీ పుట్ట తిరుపతి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఏ ఒక్కరి వివరణ తీసుకోకుండా ఒక ప్రజాప్రతినిధి వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ప్రసారం చేయడం బాధ్యతారాహిత్యమైన చర్య అని, ఇది ఎంతమాత్రం నైతిక విలువలతో కూడిన జర్నలిజం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అది పూర్తిగా నిరాధారమైనదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని ప్రతిపక్షాలు కావాలని బురద చల్లే రాజకీయాలు చేస్తున్నాయని, ఒక దళిత ఎమ్మెల్యేపై ఇలాంటి అసత్య కథనాలు వెలువరించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

మీడియా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని, అదే సమయంలో తమ గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడుకునే హక్కు తమకు ఉందన్నారు. సంబంధిత టీవీ ఛానల్ యాజమాన్యం తక్షణమే స్పందించి వాస్తవాలను వెల్లడించి, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, దళిత సామాజిక వర్గం తరఫున భారీ పరువు నష్టం దావా వేస్తామని పుట్ట తిరుపతి హెచ్చరించారు.