రాష్ట్రంలో తాగు, సాగునీటి అవసరాలు, కరువు నివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయల ప్రత్యేక సహాయ ప్యాకేజీ మంజూరు చేయాలని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

రాష్ట్రంలో తాగు, సాగునీటి అవసరాలు, కరువు నివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయల ప్రత్యేక సహాయ ప్యాకేజీ మంజూరు చేయాలని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. చెరువులు, నీటి వనరుల పునరుజ్జీవం పురోగతిలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి వివిధ కేంద్ర పథకాల కింద తగిన సహాయం అందించాలని అందులో పేర్కొంది. శాసనసభలో ఎల్ నినో పై చర్చ సందర్భంగా... డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 8 అంశాలపై తీర్మానం ప్రవేశపెట్టగా... అన్నీ రాజకీయ పార్టీలు తీర్మానానికి మద్దతిచ్చాయి.

2026–27 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని జీఎస్డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్రానికి అదనంగా 1,500 మెగావాట్ల విద్యుత్ కేటాయించాలని... కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో కేటాయించకుండా ఉన్న కోటా నుంచి దీన్ని అందించాలని కోరింది. విండో– ఐ కింద 5 మిలియన్ టన్నుల బొగ్గు లింకేజీ నిర్ధారించి రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రేక్ల లభ్యతను పెంచాలని... విద్యుత్ ట్రాన్స్మిషన్ చార్జీలను సడలించి, అవసరమైన సాయం అందించాలని కోరింది. ఎల్నినో పరిస్థితులను క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వీలైనంత త్వరగా రాష్ట్రానికి పంపించాలని... జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి తగిన సాయం మంజూరు చేయాలని కోరింది.