మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి మరియు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు భవనంను హైకోర్టు జడ్జ్ జస్టిస్ ఈవి వేణుగోపాల్, జస్టిస్ ఎన్. రాజేశ్వరరావు, జస్టిస్ బిఆర్.మధుసూదనరావు ప్రారంభించారు. మరిపెడలో నూతన న్యాయస్థానం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
బార్–బెంచ్ సమన్వయంతో ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవి వేణుగోపాల్
⏩మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో నూతన న్యాయస్థానం ప్రారంభం.
⏩రాజ్యాంగ హక్కులు ప్రతి ఒక్కరికీ అందాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవి వేణుగోపాల్
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవి వేణుగోపాల్ మాట్లాడుతూ..
న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి వేగం తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి బార్ మరియు బెంచ్ మధ్య సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్నారు. కోర్టులో వాదనలు వినిపించే ప్రతి న్యాయవాది Officer of the Court గా వ్యవహరిస్తూ, న్యాయస్థానానికి సహకరించాలని, చట్టపరమైన అంశాలను సమగ్రంగా కోర్టు ముందుంచాలని సూచించారు.
న్యాయమూర్తులు ప్రతి కేసును ఎంతో శ్రద్ధగా పరిశీలించి, చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. న్యాయవాదులు కూడా న్యాయస్థాన నిర్ణయాలను విస్తృత దృక్పథంతో అర్థం చేసుకోవాలని సూచించారు. తాను న్యాయవాదిగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న ఒక కేసు అనుభవాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని అనంతరం పూర్తిగా అధ్యయనం చేయడం ద్వారా, తాను వాదనలో ప్రస్తావించలేకపోయిన ముఖ్యమైన అంశాన్ని గుర్తించానని తెలిపారు. ఈ అనుభవం ద్వారా న్యాయవ్యవస్థలో నిరంతర అధ్యయనం, ఆత్మపరిశీలన ఎంత ముఖ్యమో వివరించారు.
రాజ్యాంగ హక్కులు ప్రతి ఒక్కరికీ అందాలి
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ప్రాథమిక హక్కులు, న్యాయపరమైన రక్షణలు అందరికీ సమానంగా అందేలా చూడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థ, బార్, కార్యనిర్వాహక వ్యవస్థతో పాటు ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 మరియు ఆర్టికల్ 51Aలోని స్ఫూర్తిని ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలోని బలహీన వర్గాలు, ఆశ్రయ గృహాల్లో ఉన్న పిల్లలు మరియు ఇతర అవసరమైన వారికి చట్టపరమైన రక్షణ, సంక్షేమ సేవలు అందేలా న్యాయవ్యవస్థ మరియు కార్యనిర్వాహక వ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
న్యాయస్థాన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం
న్యాయవ్యవస్థపై పెరుగుతున్న పని భారాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన కోర్టు భవనాలు, సిబ్బంది, సాంకేతిక సదుపాయాలు మరియు ఇతర మౌలిక వసతులు అవసరమని న్యాయమూర్తి పేర్కొన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్త జిల్లాలకు తగిన న్యాయస్థాన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన సహకారం అందించాలని కోరారు.
మహబూబాబాద్ జిల్లా కోర్టు భవనానికి త్వరలో శంకుస్థాపన
వరంగల్ జిల్లా నుంచి విడిపోయి ఏర్పడిన మహబూబాబాద్ జిల్లాకు పూర్తిస్థాయి జిల్లా కోర్టు భవనం అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కోర్టు భవనానికి త్వరలోనే ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు, న్యాయవ్యవస్థకు చెందిన అధికారులు మరియు ఇతర సంబంధిత విభాగాల సమన్వయం అవసరమని అన్నారు.
జిల్లా కలెక్టర్ కృషికి అభినందనలు
జిల్లా కలెక్టర్ న్యాయస్థాన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం పట్ల చూపుతున్న నిబద్ధతను హైకోర్టు జడ్జ్ జస్టిస్ ఈవి వేణుగోపాల్ అభినందించారు. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా కూడా ఆమె కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. మరిపెడ న్యాయస్థాన ఏర్పాటుకు సహకరించిన జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులు, PDJ మురళీ మోహన్, ఇతర న్యాయమూర్తులు, న్యాయస్థాన సిబ్బంది, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాదులు మరియు సంబంధిత అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మరిపెడ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. బార్–బెంచ్ సమన్వయంతో మరిపెడ న్యాయస్థానం ప్రజలకు సత్వర, సమర్థవంతమైన న్యాయం అందించే కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
న్యాయమూర్తులు ఎన్. రాజేశ్వర్ రావు, బిఆర్. మధుసూదనరావు మాట్లాడుతూ..
జిల్లాలో కోర్టు భవనం ప్రారంభించడం సంతోషం కలిగించిందని, ప్రతీ ఒక్కరికీ తక్షణమే న్యాయ సేవలు అందించాలని సూచించారు, జిల్లాలో చరిత్రాత్మకమైన మరిపెడ లో కోర్టు ఆవిష్కత , ప్రాముఖ్యత గురించి మాట్లాడారు, స్వంత జిల్లాలో ఉన్న అనుభవాలు గుర్తుకు చేసారు.
అంతకు ముందు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో న్యాయమూర్తులకు ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్, స్వాగతం పలికి మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందచేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, సీనియర్, జూనియర్, జడ్జిలు డికె మురళీమోహన్, శాలిని షాకెల్లి, స్వాతి మురారి, కృష్ణతేజ్, ధీరజ్ కుమార్, జీవన్ కుమార్, మహతి వైష్ణవి, అఖిల, దిలీప్ కుమార్ నాయక్, సూర్య చంద్రకళ, క్యాన్ లాల్, చండే శరీ దేవి, జ్యోత్స్న, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, సంబంధిత జిల్లాలబార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శలు, సీనియర్ న్యాయవాదులు, ప్రజలు పాల్గొన్నారు.