Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం: సీఎం రేవంత్ రెడ్డి

మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం: సీఎం రేవంత్ రెడ్డి
Share Short Clip Download PDF

న్యూఢిల్లీ(రైట్స్ మీడియా): రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 లోని 550 ఎకరాల భూమిపై సర్వహక్కులూ ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దాదాపు రూ. 50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు తెలంగాణ ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ..

ఈ తీర్పు తెలంగాణ ప్రజల గొప్ప విజయమని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయస్థానాల్లో సమర్థవంతంగా పోరాడి రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు రూ. 1 లక్షా 50 వేల కోట్ల విలువైన భూములను కాపాడినట్టు వెల్లడించారు. మియాపూర్‌లోని 550 ఎకరాలతో పాటు రాష్ట్రంలో మొత్తం 7 ప్రధాన ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూములను రక్షించామని, వాటిని ప్రజాప్రయోజనాల కోసం వినియోగిస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వం సాధించుకున్న భూములను అలాగే వదిలేస్తే తిరిగి అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉన్నందున, రక్షించిన భూముల్లో అటవీ శాఖకు చెందినవి ఆ శాఖకు, రెవెన్యూ భూములను రెవెన్యూ శాఖకు అప్పగిస్తామని చెప్పారు. వనరుల సమీకరణ కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఈ భూముల విక్రయం, తద్వారా వచ్చే నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై అధ్యయనం చేస్తుందని సీఎం తెలిపారు. ప్రధానంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి, నిరుపేదలకు విద్యను అందించడానికి, ఇందిరమ్మ ఇండ్లు, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర ప్రయోజనాల కోసం ఈ నిధులను వెచ్చిస్తామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాలనీలు, ధరణి ముసుగులో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి మియాపూర్ లాంటి విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు కబ్జాదారులు, ప్రైవేటు వ్యక్తులు యత్నించారని విమర్శించారు. గత మూడేళ్లుగా న్యాయవాదులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, బలమైన వాదనలు వినిపించి వేల కోట్ల ఆస్తులను కాపాడగలిగామన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం రక్షించిన వివిధ భూముల వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించారు. ఐఎంజీ భూములతో పాటు, కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలు, మామిడిపల్లిలో 450 ఎకరాలను న్యాయపోరాటం ద్వారా సాధించామన్నారు. హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ కలాన్‌లో 140 ఎకరాల అటవీ భూమిని కాపాడామని, శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో రూ. 3,600 కోట్ల విలువైన 36 ఎకరాలను హైకోర్టు అనుకూల తీర్పుతో (సెప్టెంబర్ 3, 2025న) ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గండిపేట మండలం మంచిరేవులలో రూ. 10 కోట్ల విలువైన 143 ఎకరాల భూమిని రక్షించి, అందులో మూసీ రివర్ ఫ్రంట్‌ను ఆనుకొని ఉన్న 50 ఎకరాలను యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కోసం కేటాయించినట్లు వివరించారు. వీటితో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ. 400 కోట్ల విలువైన 106 ఎకరాల అటవీ భూమిని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 600 ఎకరాల అటవీ భూమిని న్యాయస్థానాల్లో పోరాడి కాపాడినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.