విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ప్రతిభావంతులైన విద్యార్థులకు గ్రామీణ్ లిమిటెడ్ క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ద్వారా స్కాలర్ షిప్స్ అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు విద్యాభ్యాసానికి అడ్డంకి కాదని నిరూపించారని విద్యార్థులను అభినందించారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకిగా మారకుండా వారికి అండగా నిలుస్తూ విద్యాభ్యాసానికి సహకారం అందిస్తున్న క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్ సంస్థల సేవలను ఆమె అభినందించారు.
క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్ సంస్థల సహకారంతో జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన రక్ష, సౌజన్య, పూర్ణ చందర్, సమీర నలుగురు విద్యార్థులకు స్కాలర్ షిప్ అందచేయడం పట్ల ఆమె అభినందించారు.
ఎంపిక చేసిన ఒక్కో విద్యార్థికి 10 వేల రూపాయలు చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, సానుకూల ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయక విద్యలో రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, సంక్షేమ అధికారి మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ్ లిమిటెడ్ క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభ్యాసానికి తమవంతు సహకారం అందించేందుకు సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.