బహుజన వీరుడు, గోల్కొండ ఖిల్లాను ఏలిన రాజు సర్దార్ సర్వాయి పాపన్న 376 వ జయంతి వేడుకలు వరంగల్ బార్ హాల్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ ల అధ్యక్షులు చకిలం ఉపేందర్, చొల్లేటి రామకృష్ణ మాట్లాడుతూ.. సమస్త పీడిత ప్రజల విముక్తి కోసం సాహసోపేతమైన పోరాటం చేసి గోల్కొండ కోటపై రాజ్య నిర్మాణం చేసిన పాపన్న స్పూర్తితో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేయాలని, న్యాయవాద రంగంలో అణగారిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే గొప్ప వీరుడిగా పేరుగాంచిన సర్వాయి పాపన్న వరంగల్ జిల్లా ఖిలాషాపూర్ లో జన్మించడం మనకు గర్వకారణమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తీగల జీవన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్, విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ.. కడు పేదరికంలో జన్మించి భూస్వాముల దగ్గర కూలీ చేసుకునే పాపన్న పీడిత ప్రజల కష్టాలను చూసి చలించి ప్రజలను చైతన్యం చేసి, ప్రజల చేత యుద్ధం చేపించి అంతిమంగా ఆనాటి మొగల్స్ రాజ్యాన్ని హస్తగతం చేసుకొని, ప్రజా రాజ్యాన్ని ఏర్పాటు చేయడం భారతదేశంలోనే గొప్ప విషయమని అన్నారు. పాపన్న లాంటి ఎందరో బహుజన మహా వీరులు దేశంలో విముక్తి పోరాటాలు చేసి విజయాలు సాధించారని, తీవ్ర నిర్బంధం, ఎలాంటి సౌకర్యాలు లేని కాలంలో పీడిత ప్రజలను చైతన్యం చేసి విముక్తి పోరాటాలను విజయవంతం చేసి రాజ్యాలను ఏలిన ఛత్రపతి శివాజీ, పండుగ సాయన్న, సాహు మహారాజ్ లాంటి వీరుల స్పూర్తితో బహుజన రాజ్య స్థాపనకు కృషి చేయాలని అన్నారు. మూడు వందల ఏండ్ల క్రితమే తన రాజ్య పాలనలో సామాజిక న్యాయాన్ని అమలు చేసిన పాపన్న స్పూర్తితో నేటి రాజ్యంలో సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలని అన్నారు. బహుజన ఉద్యమాల వల్ల పాపన్న లాంటి మహా వీరుల జయంతి, వర్ధంతులను ప్రభుత్వాలు అధికారికంగా జరపడం సంతోషకరమైన విషయమే కానీ మహనీయుల ఆశయాల కోసం ప్రణాళికలు రచించి అమలు చేసిన నాడే సమసమాజం ఏర్పడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శులు నాగేంద్రచారి, ఊరుగొండ నరేందర్, ఉపాధ్యక్షులు సాంబశివరాజు, రఘుపతి, మహిళా ఉపాధ్యక్షులు లలిత కుమారి, వనజ, బార్ అసోసియేషన్ నాయకులు జంగ స్వప్న, ఎస్ కవిత, ఆడెపు సునీల్, ఉమా మహేశ్వరి, గొడిశాల సుజాత, పూసపెల్లి శ్రీనివాస్, మహేందర్ తో పాటు న్యాయవాదులు బత్తిని రమేష్ గౌడ్, శ్రీధర్, రామనాథం, కోటేశ్వరరావు, కిషన్ గౌడ్, పైళ్ల సంతోష్ తదితర న్యాయవాదులు హాజరై పాపన్న చిత్రపటానికి పూలు సమర్పించి, నివాళులు అర్పించారు.