Thursday, 05 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

ఓటర్ల హక్కులను రక్షించేందుకు 'ప్రీ-ప్రింటెడ్ ఫారం-7' వ్యవహారంలో దోషులు ఎవరైనా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

⏩టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్.

ఓటర్ల హక్కులను రక్షించేందుకు 'ప్రీ-ప్రింటెడ్ ఫారం-7' వ్యవహారంలో దోషులు ఎవరైనా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
Share Short Clip Download PDF

⏩ఓటర్ల జాబితా నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు మరియు నిజమైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు ప్రీ- ప్రింటెడ్ ఫారం-7 దరఖాస్తుల కుట్రపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు.

⏩ముషీరాబాద్, బహదూర్‌పురా, గోషామహల్ నియోజకవర్గాల్లో ఒకే తరహా ఘటనలు – సమగ్ర దర్యాప్తు కోసం SIT ఏర్పాటు చేయాలని డిమాండ్.

హైదరాబాద్ (రైట్స్ మీడియా): తెలంగాణలో ఓటర్ల జాబితాలను ప్రభావితం చేసి, నిజమైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రీ-ఫిల్డ్ ఫారం-7 దరఖాస్తులను సిద్ధం చేసి, వాటిని బీజేపీ కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్ల ద్వారా సమర్పిస్తున్నారనే ఆరోపణలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కు టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్, సభ్యులు వాజీద్ హుస్సేన్, ఎస్ఐఆర్ కో ఆర్డినేటర్ గంప వేణు గోపాల్, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైర్తబాద్ జిల్లా అధ్యక్షులు ఖాళీద్ సైఫుల్లాహ్, దీపక్ జాన్, మోత రోహిత్ల తో కలిసి సోమవారం ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంపై వెంటనే FIR నమోదు చేసి, ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి సమగ్ర, నిష్పక్షపాత, కాలపరిమితి కలిగిన క్రిమినల్ దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం..

ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నం. 210కు చెందిన బీజేపీ BLAగా పేర్కొంటున్న శివేగి బాలచందర్ అలియాస్ బాలు (EPIC No. RXA1929512) కాంగ్రెస్ BLA షార్ఫుద్దీన్ మరియు ఆయన కుటుంబంలోని సుమారు 31 మంది సభ్యుల పేర్లపై ఫారం-7 దరఖాస్తులు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ దరఖాస్తులు ముందుగానే ప్రీ-ప్రింట్/ప్రీ-ఫిల్ చేసి సిద్ధం చేసినట్లుగా కనిపించడం అత్యంత తీవ్రమైన అనుమానాలకు దారితీస్తోందని రాజేష్ కుమార్ పేర్కొన్నారు.

సంబంధిత వ్యక్తులు నిజంగా ఈ దరఖాస్తులను దాఖలు చేశారా? వారు సంతకం చేశారా? వారి అనుమతి లేదా సమ్మతి ఉందా? అనే అంశాలను పోలీసులు దర్యాప్తు చేయాలని కోరారు.

మూడు నియోజకవర్గాల్లో ఒకే తరహా ఘటనలు

➤1. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం: కాంగ్రెస్ BLA షార్ఫుద్దీన్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై ప్రీ-ప్రింటెడ్ ఫారం-7 దరఖాస్తులు సమర్పించినట్లు ఆరోపణలు.

➤2. బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం: 2026 అక్టోబర్ 1న ఇలాంటి ప్రీ-ప్రింటెడ్ ఫారం-7 దరఖాస్తులు గుర్తించబడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

➤3. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం: 2026 అక్టోబర్ 3న సుమారు 15 ప్రీ-ప్రింటెడ్ ఫారం-7 దరఖాస్తులను బీజేపీ BLA పోలింగ్ బూత్ నం. 173కు చెందిన BLOకు అందజేయడానికి ప్రయత్నించినట్లు, అయితే దరఖాస్తులపై సంబంధిత దరఖాస్తుదారుల సంతకాలు లేకపోవడంతో పాటు అవి పెద్ద సంఖ్యలో ఒకేసారి రావడంతో BLO వాటిని స్వీకరించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తక్కువ వ్యవధిలో మూడు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే తరహా ప్రీ-ఫిల్ చేసిన ఫారం-7 దరఖాస్తులు వెలుగులోకి రావడం వెనుక ఒకే మూలం, ఒకే నమూనా, ఒకే డేటాబేస్ లేదా సమన్వయంతో పనిచేసే నెట్‌వర్క్ ఉందా? అనే అంశాన్ని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రాజేష్ కుమార్ అన్నారు.

ఇది స్థానిక ఘటన మాత్రమేనా? లేక పెద్ద కుట్రలో భాగమా?

కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు, వారి కుటుంబ సభ్యులు మరియు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వారి ఎన్నికల వివరాలను సేకరించి, వారి అనుమతి లేకుండా ఫారం-7లను ముందుగానే సిద్ధం చేశారా అనే విషయాన్ని పోలీసులు విచారించాలని ఆయన కోరారు.

ప్రీ-ప్రింటెడ్ దరఖాస్తులను ఎవరు తయారు చేశారు? ఎక్కడ ప్రింట్ చేశారు? ఎవరికి పంపిణీ చేశారు? ఎవరి ఆదేశాల మేరకు వాటిని BLOలకు సమర్పించారు? వాటిలో ఉన్న వ్యక్తిగత ఎన్నికల సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించారు? అనే అంశాలపై డాక్యుమెంటరీ, డిజిటల్, ఫోరెన్సిక్ మరియు మౌఖిక ఆధారాలతో దర్యాప్తు జరగాలని కోరారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయం పాత్రపైనా దర్యాప్తు చేయాలి

తెలంగాణలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో ప్రీ-ప్రింటెడ్ ఫారం-7 దరఖాస్తులు సిద్ధం చేసి, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లకు, అనంతరం స్థానిక BLAలకు అందించారనే ఆరోపణలు కూడా ఉన్నాయని రాజేష్ కుమార్ తెలిపారు.

ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది దర్యాప్తులో తేల్చాలని, దర్యాప్తును కేవలం స్థానిక BLA స్థాయికే పరిమితం చేయకుండా ఫారాలు ఎవరు తయారు చేశారు.. ఎవరు ముద్రించారు? ఎవరు ఆదేశించారు? ఎవరు పంపిణీ చేశారు? ఎవరు సమన్వయం చేశారు? ఎవరు ఆర్థికంగా లేదా సంస్థాగతంగా సహకరించారు? అనే అంశాల వరకు విస్తరించాలని డిమాండ్ చేశారు.

అలాగే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పాత్రపై కూడా దర్యాప్తు జరగాలని, ఆయనకు ఈ వ్యవహారం గురించి ముందస్తు సమాచారం ఉందా? ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా? ఈ కార్యకలాపాలకు సహకరించారా? అనే అంశాలను ఆధారాల ఆధారంగా విచారించాలని రాజేష్ కుమార్ కోరారు.

రాజకీయ హోదా లేదా పార్టీ పదవితో సంబంధం లేకుండా, దర్యాప్తులో ఎవరైనా నేరపూరిత బాధ్యత వహించినట్లు తేలితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు.

FIR నమోదు చేసి SIT ఏర్పాటు చేయాలి.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..

ఈ ఘటనలు కేవలం ఎన్నికల ప్రక్రియలో జరిగిన సాధారణ అవకతవకలుగా చూడకూడదని, నిజమైన ఓటర్లను అక్రమంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రయత్నం జరిగి ఉంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్రమైన దాడి అవుతుందని రాజేష్ కుమార్ అన్నారు.

అందువల్ల...
➤వెంటనే FIR నమోదు చేయాలి.
➤ ముషీరాబాద్, బహదూర్‌పురా, గోషామహల్ ఘటనలను ఒకదానితో ఒకటి అనుసంధానించి దర్యాప్తు చేయాలి.
➤వివాదాస్పద ఫారం-7 దరఖాస్తుల అసలు కాపీలను స్వాధీనం చేసుకుని భద్రపరచాలి.
➤ సంతకాలు, హ్యాండ్‌రైటింగ్, ప్రింటింగ్ వివరాలు, పత్రాల మూలాలను ఫోరెన్సిక్‌గా పరిశీలించాలి.
➤ సంబంధిత BLOలు, AEROలు, EROల వద్ద ఉన్న రికార్డులను సంరక్షించాలి.
➤ CCTV ఫుటేజీ, డిజిటల్ కమ్యూనికేషన్లు, ప్రింటింగ్ రికార్డులు మరియు చట్టపరంగా పొందగలిగే ఇతర ఆధారాలను సేకరించాలి.
➤ సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేయాలి.
➤ ఇలాంటి ఫారం-7 దరఖాస్తులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా సమర్పించబడ్డాయా అనే అంశాన్ని పరిశీలించాలి.
➤ ఈ వ్యవహారం వెనుక విస్తృతమైన వ్యవస్థీకృత నెట్‌వర్క్ ఉందా అనే విషయాన్ని వెలికితీయాలి.

చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే, తప్పుడు సమాచారం ఇవ్వడం, తప్పుడు ప్రకటనలు చేయడం, నకిలీ పత్రాల తయారీ/వినియోగం, మోసం, కుట్ర, వ్యక్తి పేరును దుర్వినియోగం చేయడం లేదా ఎన్నికల హక్కులను అక్రమంగా ప్రభావితం చేయడం వంటి నేరాలకు వర్తించే చట్టపరమైన నిబంధనల కింద* బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజేష్ కుమార్ కోరారు.

ఫారం-7లో తప్పుడు ప్రకటనలు చేయడంపై Representation of the People Act, 1950లోని Section 31 కింద ఉన్న నిబంధనలను కూడా దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

అలాగే దర్యాప్తులో వాస్తవాలు నిర్ధారించిన మేరకు *Bharatiya Nyaya Sanhita (BNS)లోని 212, 217, 61, 61(2), 3(5) తదితర సెక్షనలా కింద, తప్పుడు సమాచారం, క్రిమినల్ కుట్ర, ఫోర్జరీ, మోసం, ప్రేరేపణ తదితరాలకు వర్తించే నిబంధనల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఓటు హక్కును కాపాడటం ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే..

ఒక అర్హత కలిగిన పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండటం అతని ప్రజాస్వామ్య హక్కు. తప్పుడు దరఖాస్తులు, నకిలీ ప్రకటనలు లేదా వ్యక్తుల అనుమతి లేకుండా సిద్ధం చేసిన పత్రాల ద్వారా నిజమైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు ప్రయత్నిస్తే, అది ఒక్క వ్యక్తి హక్కుపై దాడి మాత్రమే కాదు – ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థపై దాడి. ముషీరాబాద్, బహదూర్‌పురా, గోషామహల్‌లో వెలుగులోకి వచ్చిన ఘటనలు పరస్పరం సంబంధం లేని సంఘటనలా? లేక ఒక పెద్ద సమన్వయంతో జరుగుతున్న చర్యలో భాగమా? అనే నిజాన్ని పోలీసులు వెలికితీయాలి. రాజకీయ స్థాయి ఏదైనా సరే, దర్యాప్తులో బాధ్యులుగా తేలిన ప్రతి ఒక్కరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. అందువల్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెంటనే FIR నమోదు చేసి, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి, సమగ్రంగా మరియు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి అసలు సూత్రధారులను వెలుగులోకి తీసుకురావాలని పులిపాటి రాజేష్ కుమార్ డిమాండ్ చేశారు.