Thursday, 05 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రూ.88.50 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవోలు జారీ

కార్తీక మాసంలోనే భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసుకోవాలి - ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయడమే లక్ష్యం

38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రూ.88.50 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవోలు జారీ
Share Short Clip Download PDF

కుల సంఘాల ప్రతినిధులకు జీవో పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

బీసీలకు కేటాయించిన భూములను ఏ ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు.. అవి బలహీన వర్గాల ఆస్తులు: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్(రైట్స్ మీడియా): రాష్ట్రంలో 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆయా కుల సంఘాలకు కేటాయించిన భవన నిర్మాణాలకు సంబంధించి రూ.88.50 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం మినిస్టర్ క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ కుల సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎంపీ సురేష్ షెట్కర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయ దేవి, మాజీ ఓబీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల ముఖ్య నేతలు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు, ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవన నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. గతంలో స్థలాలు కేటాయించినప్పటికీ కొన్ని పరిపాలనా, సాంకేతిక కారణాల వల్ల నిర్మాణాలు ముందుకు సాగలేదని, హెచ్‌ఎండీఏ సహకారంతో ఆ సమస్యలను పరిష్కరించామని చెప్పారు.

కుల సంఘాలకు కేటాయించిన స్థలాలను నిర్మాణాలకు అనువుగా తీర్చిదిద్దేందుకు 'రెడీ టు కన్స్ట్రక్షన్' విధానంలో లేఅవుట్లను అభివృద్ధి చేశామని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందున కుల సంఘాలు ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. కార్తీక మాసంలోనే ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపనలు చేసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...

కేవలం స్థలాలు, నిధులు కేటాయించి చేతులు దులుపుకునే ప్రభుత్వం తమది కాదని, భవనాలను నిర్మించి బీసీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఏడాది కాలంలోగా లేదా నిర్మాణ పరిస్థితులను బట్టి నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

నిర్మాణాలకు అవసరమైన అనుమతులను ఇంజనీరింగ్ శాఖ, హెచ్‌ఎండీఏ సమన్వయంతో కల్పిస్తామని, సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేసి ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించి ప్రోగ్రెస్ రిపోర్టులు తీసుకుంటామని చెప్పారు.

38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రూ.88.50 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవోలు జారీ

బీసీల భూములపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దు

బీసీ కుల సంఘాలకు కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. బీసీలకు కేటాయించిన భూములు బలహీన వర్గాల ఆస్తులని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాకుండా ఏ ప్రభుత్వం కూడా తిరిగి తీసుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. ఆ భూముల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.

కేటాయించిన నిధులతో నిర్ణీత కాలపరిమితిలో భవన నిర్మాణాలు పూర్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత కుల సంఘాలపై కూడా ఉందని, నిర్మాణాల్లో జాప్యం జరిగితే సంబంధిత సంఘాల ప్రతినిధులను బాధ్యులుగా చేస్తూ పనులు పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బీసీ కుల సంఘాల భవనాల నిర్మాణం, నిర్వహణ కోసం ప్రభుత్వం జీవో నంబర్ 14 ద్వారా కొత్త కార్యవర్గాల ఎంపికకు మార్గదర్శకాలు తీసుకొచ్చిందని తెలిపారు. నిర్మాణాలు ప్రభుత్వ నిర్దేశిత నిబంధనల ప్రకారం జరగాలని, భవనాలను బీసీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, వసతి సౌకర్యాలు, గ్రంథాలయాలు, సామాజిక కార్యక్రమాలు, కుల సంఘాల అభ్యున్నతికి ఉపయోగించుకోవాలని సూచించారు.

ఆర్థికంగా స్థోమత ఉన్న కుల సంఘాలు ప్రభుత్వం కేటాయించిన నిధులకు అదనంగా తమ వంతు సహకారం అందించాలని కోరారు. కుల సంఘాల ప్రతినిధులు అంతర్గత విభేదాలకు తావివ్వకుండా ఐక్యంగా ఉండి భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ నగరంలో పద్మశాలి, పేరక, గౌడ, కాపు తదితర కుల సంఘాల వసతి గృహాల ద్వారా వేలాది మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని, అదే స్ఫూర్తితో ఇప్పుడు నిర్మించబోయే ఆత్మగౌరవ భవనాలు భవిష్యత్ తరాలకు విద్యా, సామాజిక అభివృద్ధి కేంద్రాలుగా నిలవాలని ఆకాంక్షించారు.

బీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వ విధానంలో అంతర్భాగమని, బీసీలకు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రివర్గం, ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని బీసీ కుల సంఘాల ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.

బీసీల భూములపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దు

వి.హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారు మాట్లాడుతూ...

బీసీ కుల సంఘాలన్నీ ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేయడం బీసీ వర్గాల అభ్యున్నతిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.

రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా కులాల వారీగా తమ ప్రత్యేకతలను కాపాడుకుంటూనే అన్ని వర్గాలు ఐక్య భావనతో ముందుకు సాగాలని సూచించారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని తెలిపారు.

గతంలో ముదిరాజ్, మున్నూరు కాపు కులాలకు ఆత్మగౌరవ భవనాలు కేటాయించినట్లుగానే ఇప్పుడు ఇతర బీసీ కుల సంఘాలకు కూడా అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయానికి తోడు కులాల్లో ఆర్థికంగా స్థోమత ఉన్నవారు కూడా తమ వంతు సహకారం అందించి నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు.

వి.హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారు మాట్లాడుతూ...

జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ...

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో బీసీ కుల సంఘాలు, సంచార జాతుల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు బడ్జెట్ సాంక్షన్ జీవోలు అందించడం అభినందనీయమన్నారు. 40 బీసీ కుల సంఘాలు, 36 సంచార జాతుల కులాలకు కలిపి మొత్తం 76 కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి బడ్జెట్ సాంక్షన్ జీవోలు అందించారని పేర్కొన్నారు.

హైదరాబాద్ వంటి మహానగరంలో చదువుకునే బీసీ విద్యార్థులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఈ భవనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు వి.హనుమంతరావులకు బీసీ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు పెట్టడం, హైదరాబాద్ నడిబొడ్డున జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను ముఖ్యమంత్రి స్వయంగా ఆవిష్కరించడం, బీహార్ తర్వాత తెలంగాణలో దేశంలోనే చారిత్రాత్మకంగా కులగణన సర్వే చేపట్టడం వంటి కార్యక్రమాలు బీసీలకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయని అన్నారు.

అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు కేటాయించినట్లుగానే, బీసీలందరూ కలిసి జయంతులు, సభలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి హైదరాబాద్‌లో ఐదు ఎకరాల స్థలం కేటాయించి సమగ్ర 'బీసీ భవన్' నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ...

బీసీ భవన్ నిర్మాణానికి స్థల పరిశీలన చేయాలి వి.హనుమంతరావు సూచన

అంబర్‌పేట ఛే నంబర్ చౌరస్తా పరిసరాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి సమీపంలో ఇప్పటికే ఉన్న స్థలాన్ని బీసీ అవసరాల కోసం వినియోగించుకోవాలని వి.హనుమంతరావు సూచించారు. ఆ స్థలంలో ఇప్పటికే ఫూలే విగ్రహం ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఆ స్థలం కబ్జాలకు గురవుతోందని తెలిపారు.

అక్కడ గ్రంథాలయంతో పాటు రవీంద్రభారతి తరహాలో పెద్ద ఆడిటోరియం నిర్మిస్తే విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రికి లేఖ రాశానని, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రత్యేక చొరవ తీసుకుని ఆ స్థలాన్ని బీసీ అవసరాలకు సద్వినియోగం చేసేలా చూడాలని కోరారు.

బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలు కేవలం భవనాలుగా కాకుండా విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక ఐక్యతకు కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న నేతలు ఆకాంక్షించారు.

బీసీ భవన్ నిర్మాణానికి స్థల పరిశీలన చేయాలి వి.హనుమంతరావు సూచన