సత్తుపల్లి(రైట్స్ మీడియా): మురసు తుపాను ప్రభావంతో బేతుపల్లి చెరువు అలుగు పొంగి వరద ఉద్ధృతి పెరిగిన వేళ.. ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ధైర్యసాహసాలు అభినందనీయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణనష్టం జరగకుండా బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
బుధవారం రాత్రి బేతుపల్లి చెరువు వద్ద వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించే క్రమంలో పడవ బోల్తాపడి 11 మంది వరద ఉద్ధృతిలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.