కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు, ఆర్టీసీ సంస్థ అభివృద్ధి అనే మూడు ప్రధాన అంశాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.
- రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సుమారు రూ.1,400 కోట్ల బకాయిల చెల్లింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించామని, ఈ అంశంపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.
- గతంలో పెండింగ్లో ఉన్న సీసీఎస్, పీఎఫ్ తదితర బకాయిలను విడతలవారీగా చెల్లిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు.
- ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేశామని, డీఏ బకాయిలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
- పదేళ్ల తర్వాత ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించామని, ఎన్నికైన గుర్తింపు సంఘంతో కమిటీ ఏర్పాటు చేసి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
- కార్మికుల ఆర్థిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ హయాంలో 3,000కు పైగా కొత్త బస్సుల కొనుగోలుతో పాటు, పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్ నగర పరిధిలో సుమారు 2,200 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నామని, ఎక్కడైనా బస్సుల అవసరం ఉంటే ప్రజలు విజ్ఞప్తులు అందించాలని సూచించారు. ప్రజల అవసరాలను పరిశీలించి రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామని తెలిపారు.
హైదరాబాద్లో ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు తలెత్తకుండా పర్యావరణహిత రవాణాను ప్రోత్సహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
- నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
- తొలిదశలో పాత డీజిల్ బస్సుల్లో 250 బస్సులను రెట్రోఫిట్ విధానం ద్వారా మార్పు చేస్తున్నామని వెల్లడించారు.
- క్యూర్ (Q-Area) ప్రాంతంలో ఈవీ ఆటోలను ప్రోత్సహించేందుకు రూ.200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
- ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం మినహాయింపు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
- ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ఆధునికీకరిస్తామని తెలిపారు.
- రోడ్డు భద్రత కోసం రిఫ్లెక్టర్ల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, కాలం చెల్లిన వాహనాల తొలగింపునకు స్క్రాప్ పాలసీని తీసుకొచ్చామని వివరించారు.
-
రాష్ట్రవ్యాప్తంగా బస్స్టాండ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని పరిరక్షించడం, సంస్థను అభివృద్ధి చేయడం, మహిళలు సహా అన్ని వర్గాల ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, కాలుష్యాన్ని తగ్గించే పర్యావరణహిత రవాణా వ్యవస్థను రూపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.