GWMC, నవంబర్ 03(రైట్స్ మీడియా): నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు.

మంగళవారం కమిషనర్ ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులతో కలిసి గ్రేటర్ వరంగల్ పరిధిలోని మడికొండ, మెట్టుగుట్ట, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి మంచినీటి పైప్‌లైన్లు, నీటి సరఫరా వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ, వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ముందుగా మడికొండలోని బాలాజీనగర్ వాటర్ ట్యాంక్ నుంచి మెట్టుగుట్ట వరకు ఏర్పాటు చేసిన మంచినీటి పైప్‌లైన్‌ను పరిశీలించి, నీటి సరఫరా వ్యవస్థ పనితీరును సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సక్రమంగా మంచినీటిని సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. మడికొండ ప్రాంతంలోని వివిధ కాలనీలలో నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించి, పనుల నాణ్యతను పరిశీలించారు.

అనంతరం ఇందిరమ్మ కాలనీ సమీపంలోని స్మశానవాటికను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

అనంతరం మడికొండ, రాంపూర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేర్వేరుగా సేకరించాలని, స్వచ్ఛ ఆటోల ద్వారా ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ సక్రమంగా కొనసాగుతున్నదీ లేనిదీ శానిటరీ జవాన్లు నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించడం, విధుల పట్ల అలసత్వం ప్రదర్శించడం వంటి లోపాలు గుర్తించిన పక్షంలో బాధ్యులైన సిబ్బందిపై జరిమానాలు విధించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు.

నగర పరిధిలో ఎక్కడా అనుమతులు లేని బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన అనధికారిక ప్రకటనల బోర్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లను తక్షణమే తొలగించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించాలని అధికారులకు స్పష్టం చేశారు.

నగరాభివృద్ధి పనుల అమలుతో పాటు ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందించడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం అధికారుల ప్రధాన బాధ్యత అని కమిషనర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజారెడ్డి, ఇంజనీర్ రవికుమార్, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.