Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

గ్రావెల్ అనుమతుల కోసం సులభతరమైన ఆన్‌లైన్ విధానం ప్రారంభం

జిల్లాలో అమల్లోకి వచ్చిన నూతన సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానం

గ్రావెల్ అనుమతుల కోసం సులభతరమైన ఆన్‌లైన్ విధానం ప్రారంభం
Share Short Clip Download PDF

• హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఇంటిగ్రేటెడ్ గ్రావెల్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్

అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఇంటిగ్రేటెడ్ గ్రావెల్ పర్మిషన్ పోర్టల్: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ(రైట్స్ మీడియా): అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేయడంతో పాటు మట్టి (గ్రావెల్) తవ్వకాలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానంను అమలు చేస్తూ ప్రజలకు అందుబాటులో నూతనంగా పోర్టల్ ను తీసుకువచ్చినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు.

సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన సమీకృత గ్రావెల్( మట్టి) నిర్వహణ విధానం ( ఇంటిగ్రేటెడ్ గ్రావెల్ మేనేజ్మెంట్ సిస్టం ) పోర్టల్ ను జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానం అమలు గురించిన వివరాలను అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ మీడియాకు వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ....

ఈ విధానం ద్వారా పౌరులు తమ మొబైల్ నంబర్ నమోదు చేసి, ఓటీపీ ద్వారా సులభంగా లాగిన్ అయి గ్రావెల్ తవ్వకాలకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

దరఖాస్తులు సంబంధిత అధికారులకు చేరతాయని, రెవెన్యూ భూములకు సంబంధించిన అనుమతులను పరిశీలించి మూడు నుంచి ఐదు రోజుల్లో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమన్వయంతో ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.

నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలుంటే ఆ శాఖ లాగిన్‌కు కూడా దరఖాస్తును పంపించడం జరుగుతుందన్నారు.

దరఖాస్తు సమయంలో ఎక్కువ వివరాలు అడగకుండా ప్రాథమికంగా ఆధార్, తదితర వివరాలతో పాటు గ్రావెల్ ఎక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నారనే వివరాలను మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

సొంత పట్టా భూమి నుంచి గ్రావెల్ తీసుకోవాలనుకుంటే పట్టాదారు పాస్‌బుక్ కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.

ఇతరుల పట్టా భూమి నుంచి తీసుకోవాలనుకుంటే సంబంధిత భూయజమాని నుండి సమ్మతి పత్రాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.

ప్రభుత్వ భూముల విషయంలో సర్వే నంబర్, జియో కోఆర్డినేట్స్ తదితర వివరాలను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ....

దరఖాస్తుల పరిశీలన కోసం రెవెన్యూ శాఖకు మూడు పేజీల చెక్‌లిస్ట్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మట్టి (సిల్ట్) కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లో రెవెన్యూ శాఖకు, దానిని నీటిపారుదల శాఖకు ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

నీటిపారుదల శాఖ రెండు రోజుల్లో పరిశీలించి తిరిగి రెవెన్యూ శాఖకు పంపిస్తుందన్నారు.

రెవెన్యూ శాఖ ఎన్ఓసీ ఇచ్చిన అనంతరం, పరిమాణం ఎక్కువగా ఉన్నట్లయితే మైనింగ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంటుందన్నారు.

పరిమాణం తక్కువగా ఉంటే జిల్లా లాగిన్‌కు వచ్చిన అనంతరం నేరుగా అనుమతులు జారీ చేస్తారని వివరించారు.

అనుమతి మంజూరైన తర్వాత పూర్తి వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందన్నారు.

ఎంత పరిమాణంలో గ్రావెల్‌కు అనుమతి ఇచ్చారు, ఏ ప్రాంతం నుంచి తీసుకెళ్లాలి, ఏ లొకేషన్‌కు అనుమతి ఇచ్చారు, ఏ సమయానికి అనుమతి ఉంది అనే వివరాలు అందులో స్పష్టంగా ఉంటాయన్నారు.

అలాగే అనుమతించిన ట్రాక్టర్లు, ఇతర వాహనాల నంబర్లు కూడా నమోదు అవుతాయని, అనుమతి పొందిన వాహనాల ద్వారా మాత్రమే గ్రావెల్ (మట్టి )తరలించాల్సి ఉంటుందన్నారు.

గ్రావెల్ అనుమతుల కోసం సులభతరమైన ఆన్‌లైన్ విధానం ప్రారంభం

ఈ ప్రక్రియలో గ్రామ పంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. అనుమతించిన ట్రిప్పుల సంఖ్య, వాస్తవంగా తరలించిన ట్రిప్పుల సంఖ్యను పర్యవేక్షించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ పోర్టల్ వినియోగంపై రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కూడా అందించినట్లు వెల్లడించారు.

ఈ పోర్టల్ నుండి మట్టి (గ్రావెల్) అనుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత రుసుము గ్రామ పంచాయతీలకు వెళ్తుందని తెలిపారు.

ఈ విధానంలో గ్రామ పంచాయతీలకు కూడా ప్రోత్సాహకం ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

ఈ పోర్టల్ ఇసుకకు సంబంధించినది కాదని, (మట్టి ) గ్రావెల్ మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఇసుక కోసం ఇప్పటికే ప్రత్యేక పోర్టల్ ఉందని తెలిపారు.

జిల్లాలో నూతనంగా తీసుకువచ్చిన ఈ విధానం ద్వారా ఇసుక అనుమతులు జారీ చేయడం జరగదని తెలిపారు.

ఇప్పటికే గనుల శాఖ వద్ద ఒక పోర్టల్ ఉన్నప్పటికీ, అది ప్రధానంగా ప్రభుత్వ పనులకు సంబంధించిన పెద్ద మొత్తంలో మైనింగ్ అనుమతుల కోసం మాత్రమే ఉపయోగపడుతోందన్నారు.

జాతీయ రహదారుల వంటి పనులకు 2వేలు లేదా 3వేల మెట్రిక్ టన్నుల పరిమాణంలో అనుమతులు తీసుకునే ప్రక్రియ అందులో ఉందని వివరించారు. అయితే గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, ఇతర చిన్నచిన్న పనుల కోసం తక్కువ పరిమాణంలో గ్రావెల్(మట్టి ) అవసరమైనప్పుడు అనుమతులు ఎలా పొందాలో ప్రజలకు స్పష్టత ఉండటం లేదన్నారు. అలాంటి వారి సౌలభ్యం కోసమే జిల్లాలో ఈ సులభతరమైన పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

గ్రావెల్ అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.

పోర్టల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో సమీకృత గ్రావెల్(మట్టి) నిర్వహణ విధానం, అమలు గురించి మీడియా ప్రతినిధులు అడిగిన పలు సందేహాలను కలెక్టర్, అదనపు కలెక్టర్, మైనింగ్ ఏడీ నివృత్తి చేశారు.

జిల్లాలో నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ గ్రావెల్ మేనేజ్మెంట్ సిస్టం ( ఐ జి ఎం ఎస్ ) పోర్టల్ కు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్, ఇతర అధికారులు లాంఛనంగా ఆవిష్కరించారు

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, డిఆర్ఓ శ్రీనివాస్, మైనింగ్ శాఖ ఏడి రామాచారి, డి ఆర్ డి ఓ మేన శ్రీను, సిపిఓ సత్యనారాయణరెడ్డి, జి డబ్ల్యూ ఎం సి కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, సి సెక్షన్ సూపరింటెండెంట్ చల్లా ప్రసాద్,సీజీజీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధాకృష్ణ, ఈడీఎం శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

📄 IGMS Brochure