భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సౌర విద్యుత్ సమర్థవంతమైన ప్రత్యామ్నాయమని TGNPDCL చీఫ్ ఇంజనీర్ గందే మల్లికార్జున్ అన్నారు. భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని మంగళవారం వాసవి క్లబ్స్ వరంగల్ ఆధ్వర్యంలో పిన్నవారి వీధిలోని క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన ఇంజనీర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఇంజనీర్లు, క్లబ్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమానికి వాసవి క్లబ్స్ వరంగల్ అధ్యక్షుడు పల్లెర్ల వీరన్న అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా గందే మల్లికార్జున్ మాట్లాడుతూ.. భవిష్యత్ విద్యుత్ అవసరాలు, పీక్ సమయాల్లో విద్యుత్ లభ్యత, సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. గతంతో పోలిస్తే ఆధునిక సాంకేతికత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంతో విద్యుత్ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని, విద్యుత్ గ్రిడ్‌లు మరింత బలోపేతమయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్ అనేది కేవలం ఒక వృత్తి కాదు ఒక మైండ్‌సెట్ అని ఆయన పేర్కొన్నారు. ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా గృహ అవసరాలతో పాటు వాణిజ్యపరంగానూ ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలను వివరించారు. ఈ దిశగా TGNPDCL పలు చర్యలు చేపడుతోందని, చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి, ఐఏఎస్ నేతృత్వంలో సంస్థ నూతన విధానాలతో ముందుకు సాగుతోందని అన్నారు. ప్రతి గృహ యజమాని సౌర విద్యుత్ వినియోగంపై ఆలోచించాలని సూచించారు. విద్య ద్వారానే వ్యక్తి, సమాజం ఉన్నతిని సాధించగలవని ఆయన అన్నారు. భక్తితో పాటు ఆధ్యాత్మికత, సానుకూల మానవ సంబంధాలు, సంతృప్తికరమైన జీవితం కూడా అవసరమని పేర్కొన్నారు. అనంతరం క్లబ్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా డివిజినల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు సీహెచ్. చింతా మహేష్, చండరేగి ప్రశాంత్, పాలడుగుల చంద్రమౌళిలను శాలువా, జ్ఞాపిక, పుష్పగుచ్ఛం, పండ్లతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి బొడ్ల మోహన్, కోశాధికారి సంద్రు శ్రీకాంత్, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నవనిర్మాణ్ కోచ్ డాక్టర్ పృథ్వీ రాజు వల్లాల, క్లబ్ సభ్యులు తోట నర్సయ్య లింగం, గుమ్మడవెల్లి సత్యనారాయణ, గుమ్మడవెల్లి సురేష్ కుమార్, గాదె వాసుదేవ్, ప్రొఫెసర్ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.