కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ (UCETW)లో భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్స్ డే వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ సర్కిల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ డి. రాజిన్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇంజినీరింగ్ విద్యార్థులు క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యం, కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. UPSC, TGPSC, TGGENCO, TGNPDCL వంటి ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత ఉద్యోగావకాశాలను లక్ష్యంగా చేసుకుని విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. సర్ ఎం. విశ్వేశ్వరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో ఇంజినీర్లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. బిక్షాలు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యసించి, సమాజానికి ఉపయోగపడే విధంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేందుకు కళాశాల తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. అకాడమిక్ కోఆర్డినేటర్ డా. టి. ఆర్చన మాట్లాడుతూ, విద్యా ప్రగతితో పాటు నైపుణ్యాభివృద్ధి, కమ్యూనికేషన్ స్కిల్స్, ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధతపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. EEE విభాగం ఇన్‌చార్జి శ్రీ వెంకటేష్ తూర్పాటి మాట్లాడుతూ, ఇంజినీరింగ్ రంగంలో మహిళల పాత్ర రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. విద్యార్థినులు సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకుని, మహిళా సాధికారతకు ప్రతినిధులుగా ఎదగడంతో పాటు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బోధనా సిబ్బంది సాహితి, యశస్విని, వాణిశ్రీ, కిరణ్, దీప్తి, స్వప్న, వైష్ణవి, రచన, శ్రీజ, కిషన్, శ్రీనివాస్, శ్రీ విద్య, RUSA ఫెలోస్ రమాజ్యోతి, సౌజన్య, అఖిల, నాన్-టీచింగ్ సిబ్బంది సూపరింటెండెంట్ వీరునాయక్, చాగంటి శ్రీనివాస్, తాజ్ బాబా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంజినీర్స్ డే వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాలపై అవగాహన, నాయకత్వ లక్షణాలు, మహిళా సాధికారత, దేశసేవ పట్ల విద్యార్థుల్లో స్ఫూర్తి పెంపొందించేలా కార్యక్రమం సాగింది.